రాష్ట్రవ్యాప్తంగా విత్తన మేళాలు ప్రారంభం.. రైతులకు నాణ్యమైన విత్తనాలు

ప్రతిపక్షం, జూన్ 24: రైతులకు నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో విత్తన మేళాలను ప్రారంభించింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, సన్నరకం వరి సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఎంపిక చేసిన ఏడు రకాల సన్న వరి విత్తనాలకు ప్రోత్సాహక బోనస్ అందించనున్నట్లు వెల్లడించారు.

రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వరి విత్తనాలతో పాటు పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల విత్తనాలను కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. పంటల ఎంపిక, సాగు పద్ధతులు, అధిక దిగుబడుల సాధనపై శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా సూచనలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

జూన్ 30 వరకు కొనసాగనున్న ఈ మేళాల కోసం భారీ స్థాయిలో విత్తనాలు, నానో యూరియా, నానో డి.ఏ.పీ. ఎరువులను సిద్ధం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు.

Spread the love

Related News

Latest News