Trending Now

‘యువత చూపు.. కాంగ్రెస్‌ వైపు’.. రాహుల్​ కనుసన్నల్లో రేవంత్​ పాలన

హైదరాబాద్​, స్టేట్​బ్యూరో: కాంగ్రెస్​ ఆగ్రనేత రాహుల్​ గాంధీ యూత్​ను ఆకర్శించే పనిలో పడ్డారు. రోగాల బారిన పడి మంచాన ఎక్కిన కాంగ్రెస్​ పార్టీకి శస్త్ర చికిత్సలు చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా భారత్​ జోడో యాత్ర సాగించిన రాహుల్​గాంధీ, తాజాగా న్యాయ జోడో యాత్ర కొనసాగిస్తున్నారు. గతంలో నిర్వహించిన భారత్​ జోడో యాత్రకు అన్ని వర్గాల ప్రజల మద్దతు లభించడంతో పాటు రెండు రాష్ట్రాలు కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్​పార్టీ అధికార పగ్గాలు చేపట్టడం దోహదపడింది. అయితే ముఖ్యంగా పార్టీకి దూరమైన యువతను మళ్లీ పార్టీవైపు మళ్లించేందుకు రాహుల్​గాంధీ పక్కా ప్లాన్​ను ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అమలు చేస్తున్నారంటూ పార్టీలో గుసగుస వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో జోష్‌ మీదున్న కాంగ్రెస్‌ పార్టీ.. అదే దూకుడుతో పార్లమెంట్‌ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నది. ప్రత్యర్థుల కంటే ముందుగానే.. సాధారణ ఎన్నికల కోసం తొలి అభ్యర్థిని ప్రకటించేసింది. కొడంగల్‌ పర్యటనలో మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థిగా యువకుడు, మాజీ ఎమ్మెల్యే, యూత్​కాంగ్రెస్​మాజీ అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి పేరును కోస్గి బహిరంగసభలో ప్రకటించి రేవంత్​ సంచలనం సృష్టించారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీలను టార్గెట్‌ చేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించిన రేవంత్‌.. ఆఖరున వంశీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఒక్క కొడంగల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లోనే 50వేలకు తగ్గకుండా మెజార్టీ ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అలాగే ఇటీవల ఎమ్మెల్సీ నామినెటెడ్​ ఎన్నికల్లో ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్​కు అవకాశం కల్పించడం, అలాగే రాజ్యసభ ఎన్నికల్లో సైతం యూత్​కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు ఎం.అనీల్​కుమార్​అభ్యర్థిత్వం ప్రకటనలో రాహుల్​గాంధీ ఆదేశం మేరకే రేవంత్​రెడ్డి నిర్ణయం ప్రకటించారంటున్నారు. అయితే వచ్చే పార్లమెంట్​ ఎన్నికలతో పాటు పార్టీలో ఉన్న యువతకు పదవులు గ్యారంటీ అన్న సంకేతాన్ని కల్పించినట్లు చెప్పుకుంటున్నారు. దీంతో పార్టీలో యువ నాయకులు బాగా పనిచేస్తారని, అలాంటి వారిని పార్టీ గుర్తిస్తుందంటూ గత కొంతకాలంగా రేవంత్​రెడ్డి చెబుతూ వస్తున్నారు. ఆయన చెప్పిన మాటలకు ప్రస్తుతం పదవులు కల్పించి భరోసా కల్పించడంతో యువ నాయకుల్లో ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

తెలంగాణ నుంచే మొదలు..

పార్లమెంట్‌ ఎన్నికలకు తెలంగాణలో తొలి అభ్యర్థిని ప్రకటించడం వెనక కాంగ్రెస్ హైకమాండ్‌ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీలో చర్చించాకే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. కానీ, ఇప్పుడు ఓ బహిరంగసభలో వంశీపేరును రేవంత్‌ ప్రకటించడం చర్చనీయాంశమైంది. అయితే, పార్టీకి యువరక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉందని.. అగ్రనేత రాహుల్‌ చాలా రోజులుగా చెబుతున్నారు. ఆ ప్రక్రియను తెలంగాణ నుంచే మొదలెట్టినట్టు కనబడుతోంది. అందుకే.. మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థిగా యువనాయకుడు వంశీ పేరును ప్రకటించాలని.. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రేవంత్‌కు హైకమాండ్‌ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

రాహుల్‌తో వంశీకి మంచి అనుబంధం..

ఎన్​ఎస్​యుఐ నాయకుడిగా రాహుల్‌తో వంశీకి మంచి అనుబంధం ఉంది. భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌తో పాటు వంశీ నడిచారు. అందుకే, పార్టీ ఆయనకు ఈ అవకాశం ఇచ్చిందనే చర్చ జరుగుతోంది. నిజానికి మహబూబ్‌ నగర్‌ స్థానానికి మన్నె జీవన్‌రెడ్డి, కొత్తకోట సీతాదయాకర్‌ వంటి నేతలు పోటీ పడ్డారు. కానీ వాళ్లందరినీ కాదని వంశీని ఎంపిక చేసింది అధిష్ఠానం. అంతేకాదు, పార్లమెంటు బరిలో నిలిచేందుకు భారీసంఖ్యలో నేతలు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, నల్గొండ, మహబూబ్‌నగర్‌, పెద్దపల్లి లాంటి స్థానాల్లో మాత్రం పెద్దగా పోటీ లేనట్టు కనిపిస్తోంది. అందుకే అలాంటి సీట్లకు అభ్యర్థులను ముందే ప్రకటించే ఆలోచనలో కాంగ్రెస్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

రాహుల్‌ సూచనలు.. రేవంత్‌ అమలు!

రాహుల్‌ సూచనలకు అనుగుణంగానే సీఎం రేవంత్‌ రెడ్డి… కాంగ్రెస్‌కు యంగ్‌ బ్లడ్‌ను ఎక్కిస్తున్నట్టు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అధికారం చేపట్టిన రెండు, మూడు నెలల్లో రేవంత్‌ చేసిన నియామకాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎమ్మెల్సీగా బల్మూర్‌ వెంకట్‌కు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌… రాజ్యసభకు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ను ఎంపిక చేసింది. తాజాగా, వంశీకి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఈ లెక్కన.. కాంగ్రెస్‌లో మరింత మంది యువ నాయకులకు అవకాశం దక్కబోతోందనే సంకేతాల్ని హైకమాండ్‌ బలంగానే పంపిస్తోంది. మరి, రాబోయే రోజుల్లో అవకాశం దక్కించుకునే ఆ యువనాయకులు ఎవరనేది చూడాలి.

Spread the love

Related News

Latest News