ప్రతిపక్షం, జూన్ 06: రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శల హోరులో సికింద్రాబాద్ చరిత్రలోని ఒక అరుదైన ఘట్టం మరుగున పడిపోయింది. జూన్ 3తో సికింద్రాబాద్ నగరానికి 220 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే ఈ చారిత్రక సందర్భాన్ని ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, సామాజిక వర్గాలు పెద్దగా గుర్తించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
నిజాం పాలనా కాలం నుంచి ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సికింద్రాబాద్, అనేక చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక వారసత్వానికి నిలయంగా నిలిచింది. పురాతన చర్చిలు, సైనిక ప్రాంతాలు, వలస పాలన ఆనవాళ్లు ఈ నగర చరిత్రకు సాక్ష్యాలుగా ఉన్నాయి.
జంట నగరాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సికింద్రాబాద్కు ప్రత్యేక అస్తిత్వం ఉన్నప్పటికీ, ఆధునిక రాజకీయ పరిణామాల మధ్య ఆ చరిత్ర క్రమంగా మరుగున పడుతోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
చరిత్రను కాపాడుకోవడం, భవిష్యత్ తరాలకు పరిచయం చేయడం సమాజ బాధ్యత అని చరిత్రకారులు పేర్కొంటున్నారు. సికింద్రాబాద్ వారసత్వాన్ని గుర్తు చేసుకునే కార్యక్రమాలు నిర్వహించి నగర చరిత్రకు తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.















