ప్రతిపక్షం, జూలై 16: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. లబ్ధిదారులపై నిర్మాణ వ్యయం భారం తగ్గించే ఉద్దేశంతో సిమెంట్, స్టీల్ తయారీ సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం మార్కెట్‌లో సిమెంట్ బస్తా ధర సుమారు రూ.330 వరకు ఉంది. అయితే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.220కే సిమెంట్ బస్తాను సరఫరా చేయాలని ప్రభుత్వం కంపెనీలను కోరినట్లు తెలుస్తోంది. అయితే ఆ ధరకు సరఫరా చేస్తే నష్టాలు వస్తాయని కంపెనీ ప్రతినిధులు అభిప్రాయపడినట్లు సమాచారం. కనీసం రూ.270 ధరకు సిమెంట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారు తెలిపినట్లు తెలుస్తోంది.
సిమెంట్‌తో పాటు స్టీల్‌ను కూడా మార్కెట్ ధర కంటే తక్కువకు అందించేలా ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సామగ్రిని తక్కువ ధరకు అందించడం ద్వారా లబ్ధిదారులకు ఆర్థికంగా ఊరట కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
త్వరలోనే కంపెనీ ప్రతినిధులతో తుది చర్చలు జరిపి సిమెంట్, స్టీల్ ధరలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్న వేలాది మంది లబ్ధిదారులకు నిర్మాణ వ్యయంలో గణనీయమైన ఉపశమనం లభించే అవకాశం ఉంది.


















