ప్రతిపక్షం, జూలై 14: నగరంలోని చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ఓఆర్‌ఆర్ పరిధిలోని నాలుగు ప్రధాన చెరువుల అభివృద్ధికి తొలి దశలో రూ.227.98 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిధులతో చెరువుల పునరుద్ధరణ, పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పనులు చేపట్టనున్నారు. జీడిమెట్లలోని ఫాక్స్‌సాగర్ చెరువు అభివృద్ధికి రూ.74.35 కోట్లు, అమీన్‌పూర్ చెరువుకు రూ.68 కోట్లు, భాగ్‌అమీర్‌లోని అంబర్ చెరువుకు రూ.35 కోట్లు, సరూర్‌నగర్ చెరువుకు రూ.50.63 కోట్లు కేటాయించారు.
ఈ నాలుగు చెరువుల అభివృద్ధి పనులను మొత్తం మూడు దశల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు కోసం మొత్తం రూ.536 కోట్ల వ్యయం చేయనుండగా, రెండో దశలో రూ.147.46 కోట్లు, మూడో దశలో సుందరీకరణ పనుల కోసం రూ.161.06 కోట్లు ఖర్చు చేయనున్నారు.
చెరువుల అభివృద్ధి పనులను హైడ్రా (HYDRAA) ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన మరో ఉత్తర్వులో హైడ్రాకు తొలి విడతగా రూ.12.50 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా నగరంలోని జలవనరుల సంరక్షణతో పాటు పర్యావరణ సమతుల్యత, ప్రజలకు మెరుగైన వినోద, పర్యాటక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

















