- ప్రతి ఓటరును చేరుకోండి
- డబుల్ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలి
- తన్నీరు హరీశ్‌రావు, మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే
- అధిక ఎన్యూమరేషన్ చేసిన బూత్ ఏజెంట్లకు సన్మానం
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, జూలై 11: ఓటరు జాబితాల ప్రత్యేక పరిశీలన (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కీలక పాత్ర పోషించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఓటరును కలుసుకుని అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు పరిరక్షణలో ఒక్క నిర్లక్ష్యమే భవిష్యత్ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.శనివారం సిద్ధిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, ప్రజల స్పందన, నమోదు ప్రక్రియలోని ఇబ్బందులపై ఏజెంట్లను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి ఓటు విలువైనదే..
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం “ఒక వ్యక్తికి ఒకే ఓటు” అనే సూత్రాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు లేకుండా చూడటం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల్లో ఇంకా ఎస్‌ఐఆర్‌పై పూర్తి అవగాహన లేకపోవచ్చని చెప్పారు. అందుకే బీఎల్‌ఏలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను చైతన్యపరచాలని సూచించారు.
బీఎల్‌ఓలతో సమన్వయం తప్పనిసరి
బూత్ లెవెల్ అధికారుల(బీఎల్‌ఓల)తో సమన్వయం చేసుకుంటూ ప్రతి ఓటరు దరఖాస్తు ఫారం నింపి సమర్పించేలా చూడాలని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఓటర్ల నమోదు, మార్పులు, సవరణలు వంటి అంశాల్లో బీఎల్‌ఏలు చురుకుగా వ్యవహరించాలని, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని కోరారు.
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు
కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బీఎల్ఏలకు సూచించారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి యువకుడు ఓటరుగా నమోదు కావాలని చెప్పారు. ఇందుకోసం ఫారం-6 అందుబాటులో ఉంచుకుని నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
డబుల్ ఓట్లపై ప్రత్యేక నిఘా
కొన్ని రాజకీయ పార్టీలు ఇతర ప్రాంతాల్లో ఓటు కలిగిన వారిని మళ్లీ స్థానికంగా ఓటర్లుగా నమోదు చేసే ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని హరీశ్ రావు ఆరోపించారు. అలాంటి డబుల్ ఓట్లను ముందుగానే గుర్తించి ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అదే సమయంలో తమ పార్టీ మద్దతు దారుల ఓట్లు అన్యాయంగా తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
జూలై 25లోపు ప్రతి ఓటరును చేరుకోవాలి
ఈ నెల 25వ తేదీ లోపు ప్రతి ఇంటిని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారాలు నింపించి బీఎల్‌ఓలకు అందజేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్‌కు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
ఉత్తమ బూత్ ఏజెంట్లకు సన్మానం
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన బూత్ ఏజెంట్లను ఈ సందర్భంగా హరీశ్‌రావు ప్రత్యేకంగా అభినందించారు. నాసర్‌పుర 32వ వార్డులో అత్యధిక ఎన్యూమరేషన్, ఓటరు నమోదు చేపట్టిన 108వ బూత్ ఏజెంట్లు వంశీ, రాజు , 109వ బూత్ ఏజెంట్ నర్సింలులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం
ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయడంలో బీఆర్‌ఎస్ బూత్ ఏజెంట్లు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని హరీశ్ రావు సూచించారు. ప్రతి ఓటు విలువైనదని చెప్పారు. ఒక్క ఓటు కూడా అన్యాయంగా తొలగిపోకుండా చూడటం అందరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై హరీశ్ రావు చేసిన ఈ సమీక్ష, పార్టీ శ్రేణులకు ఇచ్చిన మార్గదర్శకాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుని రానున్న ఎన్నికల నేపథ్యంలో చర్చనీయాంశంగా మారాయి.






















