Trending Now

కాంగ్రెస్ నేత‌ దయాకర్ పై కేసు న‌మోదు

షాపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారని ఆరోప‌ణ‌

నిర్మల్ పీఎస్ లో బీజేపీ నేత సాగ‌ర్‌ ఫిర్యాదు

ప్రతిపక్షం ప్రతినిధి, నిర్మల్, మే 7 : జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పై నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు న‌మోదైంది. ఈ నెల 5న ఆదివారం నిర్మల్ లో జరిగిన రాహుల్ గాంధీ ఎన్నికల జన జాతర సభలో అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లపై అనుచిత‌ వ్యాఖ్యలు చేశారంటూ.. బీజేపీ యువ‌నేత‌ రాచకొండ సాగర్ నిర్మల్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదుచేశారు. దీనిపై ప్రాథ‌మిక విచార‌ణ జ‌రిపిన‌ నిర్మల్ పట్టణ పోలీసులు ద‌యాక‌ర్‌పై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన నిర్మ‌ల్‌ జన జాతర సభలో అద్దంకి దయాకర్ సభాముఖంగా మాట్లాడిన మాటలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలను అవమానప‌రిచేలా ఉన్నాయని, ఈ వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కల్పించడమే కాకుండా, రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని బీజేపీ నేత రాచకొండ సాగర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేర‌కు ద‌యాక‌ర్ మాట్లాడిన మాట‌ల సీడీని కూడా అందించిన‌ట్లు స‌మాచారం. దీనిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 504, 504 క్లాస్ 2 కింద ద‌యాక‌ర్‌పై కేసు నమోదు చేశారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు అప్రమతమయ్యారు. ఎక్కడా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి. జానకి షర్మిల పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జిల్లావ్యాప్తంగా యాక్ట్ 30 ను అమల్లోకి తెచ్చి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ అంశంపై బీజేఎల్పీ నేత‌, నిర్మల్ శాసనసభ్యుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా సీరియస్ గా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ద‌యాక‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌ను ప‌ట్టుబ‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో నిర్మల్ పోలీసులు అద్దంకి దయాకర్ కు నోటీసు పంపుతారా.. లేదా స్థానిక పోలీస్ స్టేషన్ కి రప్పిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. అయితే అద్దంకి దయాకర్ నేరుగా హైకోర్టుకు వెళ్లి దీనిపై అప్పీలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయ‌ని స‌మాచారం.

Spread the love

Related News