ప్రతిపక్షం, జూన్ 11: రాష్ట్రంలోని సర్పంచులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గౌరవ వేతనాల కోసం ఎదురుచూస్తున్న సర్పంచుల ఖాతాల్లో నేడు నిధులు జమ కానున్నాయి. ఇందుకు సంబంధించిన నిధులను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేయగా, చెల్లింపు ప్రక్రియ పూర్తికానుంది.
గత ఏడాది డిసెంబర్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు అదే నెల 20వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. దీంతో డిసెంబర్ నెలలోని పది రోజుల గౌరవ వేతనంతో పాటు ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఐదు నెలల బకాయిలు ఒకేసారి అందనున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో సర్పంచులకు నెలకు రూ.6,500 గౌరవ వేతనం అందుతోంది. వేతనాల విడుదలతో గ్రామ పంచాయతీ ప్రతినిధుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పెండింగ్లో ఉన్న చెల్లింపులు అందుతుండటంతో గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో మరింత ఉత్సాహంగా పనిచేయగలమని సర్పంచులు అభిప్రాయపడుతున్నారు.














