ప్రతిపక్షం, జూలై 27: తెలంగాణలో నేటి నుంచి వరుసగా నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రాంతాల్లో 100 నుంచి 120 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అంచనా వేశారు.
మిగిలిన జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
ఇక ఈ వర్షాలతో రాష్ట్రంలో సాగు పనులు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. రైతులు వర్షాలను అనుకూలంగా వినియోగించుకుని వ్యవసాయ పనులు చేపట్టాలని సూచించారు.


















