ప్రతిపక్షం, జూలై 27: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ప్రధాన రహదారిపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కు చెందిన ఓఎంఆర్ షీట్లు కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనతో అభ్యర్థులు, నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేయగా, టీజీపీఎస్సీ వెంటనే స్పందించి వివరణ ఇచ్చింది.
కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం, రోడ్డుపై కనిపించిన ఓఎంఆర్ షీట్లు 2018లో నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల నియామక పరీక్షకు సంబంధించిన పాత రికార్డులేనని స్పష్టం చేసింది. నియామక ప్రక్రియ పూర్తై మూడేళ్లు దాటిన తర్వాత నిబంధనల ప్రకారం వాటిని నిర్వీర్యం (శ్రెడ్డింగ్) చేసే ప్రక్రియలో భాగంగా పంపించినట్లు వెల్లడించింది.
అయితే శ్రెడ్డింగ్‌కు పంపిన ఓఎంఆర్ షీట్లు రోడ్డుపైకి ఎలా వచ్చాయనే అంశాన్ని టీజీపీఎస్సీ తీవ్రంగా పరిగణించింది. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసిన కమిషన్, మూడు రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
విచారణలో నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీజీపీఎస్సీ హెచ్చరించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రికార్డుల నిర్వహణ, శ్రెడ్డింగ్ ప్రక్రియను మరింత కట్టుదిట్టం చేస్తామని కమిషన్ పేర్కొంది.


















