ప్రతిపక్షం, జూలై 27: గుండె ఒక్కసారిగా ఆగిపోతే ప్రతి క్షణం ప్రాణాలతో పోరాటమే. అలాంటి క్లిష్ట సమయంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలను కార్డియాలజిస్ట్ డాక్టర్ సి. మమతా రెడ్డి తన సమయస్ఫూర్తి, పట్టుదలతో కాపాడారు. వరుసగా 9 సార్లు సీపీఆర్ (CPR) నిర్వహించి ఆయన గుండె స్పందించేలా చేయడంతో వైద్యురాలిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఆదివారం ఉదయం హనుమకొండలోని నివాసంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే రోహిణి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలో ఉండటంతో పరిస్థితి విషమంగా మారింది. కొంతసేపు ఆయన మరణించారనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే విధుల్లో ఉన్న డాక్టర్ మమతా రెడ్డి చికిత్సను ఆపకుండా వరుసగా తొమ్మిది సార్లు సీపీఆర్ నిర్వహించి, అత్యవసర వైద్యం అందించారు. చివరకు గుండె మళ్లీ స్పందించడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
ఇది డాక్టర్ మమతా రెడ్డికి తొలి అరుదైన ప్రాణరక్షణ కాదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజేపీ నేత, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు గుండె ఆగిపోయిన సమయంలో కూడా ఆమె ఏకంగా 11 సార్లు సీపీఆర్ నిర్వహించి ప్రాణాలతో కాపాడారు. వరుసగా ఇద్దరు ప్రముఖులను అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కాపాడటంతో ఆమె సేవలను వైద్య వర్గాలు, ప్రజలు అభినందిస్తున్నారు.
సీపీఆర్ (Cardiopulmonary Resuscitation) అనేది గుండె లేదా శ్వాస ఆగిపోయినప్పుడు చేసే అత్యవసర ప్రాణరక్షక ప్రక్రియ. ఇందులో ఛాతీపై నిర్దిష్ట వేగంతో ఒత్తిడి చేయడం, అవసరమైతే కృత్రిమ శ్వాస అందించడం ద్వారా మెదడు, గుండెకు తాత్కాలికంగా రక్తప్రసరణ కొనసాగించే ప్రయత్నం చేస్తారు. గుండె స్పందించే వరకు లేదా అధునాతన చికిత్స అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
వైద్య నిపుణుల ప్రకారం, గుండె ఆగిపోయిన వెంటనే అత్యవసర వైద్య సేవలకు సమాచారం ఇవ్వడం, ఆలస్యం చేయకుండా సీపీఆర్ ప్రారంభించడం, అవసరమైతే డిఫిబ్రిలేటర్‌తో చికిత్స అందించడం, అనంతరం అడ్వాన్స్‌డ్ కార్డియాక్ కేర్ కల్పించడం ద్వారా ప్రాణాలు నిలిచే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.
డాక్టర్ మమతా రెడ్డి సేవలను సోషల్ మీడియాలో నెటిజన్లు కొనియాడుతున్నారు. “చివరి క్షణం వరకు పోరాడే నిజమైన వైద్యురాలు”, “వైద్య వృత్తికి గౌరవం తీసుకొచ్చిన డాక్టర్” అంటూ ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.


















