ప్రతిపక్షం, జూలై 26: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం విద్యాశాఖ అదనపు బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం సీనియర్ మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగించింది. ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఇకపై విద్యాశాఖను కూడా అదనంగా పర్యవేక్షించనున్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఏర్పడిన పరిస్థితుల్లో విద్యాశాఖ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించే వరకు ప్రహ్లాద్ జోషి అదనపు బాధ్యతలు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా, ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధికారికంగా ఆమోదం తెలిపారు. దీంతో ఆయన కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకున్నట్లు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యాశాఖలో కొనసాగుతున్న కార్యక్రమాలు, విధాన నిర్ణయాలు, పరిపాలనా వ్యవహారాలను ఇకపై ప్రహ్లాద్ జోషి పర్యవేక్షించనున్నారు. త్వరలో పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించే అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

















