నోట్లో బ్యాటరీ పేలి బాలుడి మృతి.. స్క్రాప్ దందానే కారణమా?

ప్రతిపక్షం, జూలై 23: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బాలుడు లోకేశ్ (14) నోట్లో మొబైల్ బ్యాటరీ పేలి మృతి చెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. గూడెం గ్రామానికి చెందిన లోకేశ్ బ్యాటరీ పేలడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

ఈ ఘటనలో స్క్రాప్ వ్యాపారం కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. కాగజ్‌నగర్, చింతలమానేపల్లి సరిహద్దు ప్రాంతాల్లో పాత మొబైల్, ల్యాప్‌టాప్ బ్యాటరీల నుంచి రాగి, రసాయనాలను వెలికితీసి విక్రయించే స్క్రాప్ వ్యాపారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

స్క్రాప్ యార్డుల వద్ద పడేసిన పాత, దెబ్బతిన్న బ్యాటరీలను పిల్లలు ఆట వస్తువులుగా ఇంటికి తీసుకెళ్తున్నారని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. అలాంటి బ్యాటరీతో ఆడుకుంటున్న సమయంలోనే లోకేశ్ ప్రమాదానికి గురై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనకు స్క్రాప్ వ్యాపారుల నిర్లక్ష్యం కారణమా? ప్రమాదకర వ్యర్థాలను నిబంధనలకు విరుద్ధంగా పారవేశారా? అనే అంశాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు పిల్లలను పాత బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలకు దూరంగా ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు.

Spread the love

Related News

Latest News