ఆహార, ఔషధ కల్తీపై కఠిన చట్టం.. సమగ్ర బిల్లుకు సీఎం రేవంత్ ఆదేశం

ప్రతిపక్షం, జూలై 18: తెలంగాణలో ఆహార, ఔషధ కల్తీని అరికట్టేందుకు కఠినమైన సమగ్ర చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు, పాలు, ఔషధాల్లో కల్తీ కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం (TGFADCA)పై ఎంసీహెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఆకుకూరలు, కూరగాయలు, పాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు, పండ్లను త్వరగా మగ్గించేందుకు విచ్చలవిడిగా రసాయనాలు వినియోగిస్తున్నారని సీఎం పేర్కొన్నారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని తెలిపారు. అలాగే ఎరువులు, పురుగు మందుల అధిక వినియోగంతో పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు పెరుగుతున్నాయని, దీంతో కొన్ని దేశాలు భారత ఉత్పత్తుల దిగుమతులను తిరస్కరిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.

మార్కెట్‌లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో పలు రకాల వస్తువులు విక్రయిస్తున్నప్పటికీ అవి నిజంగా సేంద్రియ ఉత్పత్తులేనా అనే విషయాన్ని నిర్ధారించేందుకు సరైన వ్యవస్థ లేదని సీఎం అన్నారు. అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేస్తున్న ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు అందేలా పటిష్ఠమైన ధ్రువీకరణ వ్యవస్థ అవసరమని సూచించారు.

కల్తీ నియంత్రణకు సమగ్ర చట్టాలు అమలు చేస్తున్న దేశాలను సందర్శించి అక్కడి విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా దేశాల విధానాలపై సమగ్ర నివేదిక రూపొందించి, దాని ఆధారంగా రాష్ట్రానికి అనువైన బిల్లును సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం శాసనసభలో విస్తృతంగా చర్చించడంతో పాటు ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు స్వీకరించాలని సీఎం ఆదేశించారు.

కల్తీకి సంబంధించిన సమాచారాన్ని ప్రజల నుంచి సేకరించేందుకు విజిల్‌ బ్లోయర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కల్తీపై సమాచారం ఇచ్చే వారికి రక్షణ కల్పించే విధానాలను కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

కల్తీ నిరోధక చర్యలను ముందుగా క్యూర్ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని సీఎం సూచించారు. అక్కడ నిబంధనలను ప్రయోగాత్మకంగా అమలు చేసి ఎదురయ్యే సమస్యలు, లోటుపాట్లను గుర్తించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ఆదేశించారు.

సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ముఖ్యమంత్రి సలహాదారు, ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీలు వి. శేషాద్రి, ఎన్. శ్రీధర్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News