పేద విద్యార్థుల భవిష్యత్తే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

  • గురుకుల సీట్ల కేటాయింపులో నిర్లక్ష్యానికి తావు లేదు
  • దూర ప్రాంతాల నుంచి వచ్చే తల్లిదండ్రులతో మర్యాదగా వ్యవహరించి, సరైన మార్గదర్శనం చేయాలి
  • డీఎస్సీ భవన్‌లో TGSWREIS కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమా

ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, ఉత్తర తెలంగాణ, జూలై 15: పేద, దళిత, గిరిజన విద్యార్థుల విద్యాభవిష్యత్తును తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ఒక్క విద్యార్థి కూడా గురుకుల విద్యకు దూరం కాకుండా అధికారులు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ భారీగా నిధులు వెచ్చిస్తున్న నేపథ్యంలో, ఆ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు మరింత మానవీయ దృక్పథంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.బుధవారం హైదరాబాద్‌లోని డీఎస్సీ భవన్‌లో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TGSWREIS) కార్యాలయాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తమ పిల్లలకు గురుకులాల్లో ప్రవేశాలు కల్పించాలని వచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి మంత్రి స్వయంగా వినతిపత్రాలు స్వీకరించారు.

ఒక్కొక్కరి సమస్యను ఓపికగా వింటూ వారి కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల చదువుపై ఉన్న ఆశయాలను అడిగి తెలుసుకున్నారు.దూర ప్రాంతాలు, మారుమూల గ్రామాల నుంచి వచ్చిన పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలకు సమీప జిల్లాల్లో సీట్లు కేటాయించాలని, ఇతర జిల్లాల్లో చదివించడం వల్ల రవాణా, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రికి వివరించారు. వారి సమస్యలను విన్న మంత్రి స్పందిస్తూ, పేద కుటుంబాలకు చెందిన అర్హులైన విద్యార్థులకు సాధ్యమైనంత మేరకు వారికి అనుకూలమైన జిల్లాల్లో సీట్లు కేటాయించేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జాయింట్ సెక్రటరీ (అడ్మినిస్ట్రేషన్) శ్రీ సక్రు నాయక్కు మంత్రి పలు కీలక సూచనలు చేశారు. సీట్ల కేటాయింపు ప్రక్రియలో పారదర్శకత, మానవీయ దృక్పథం, విద్యార్థుల సంక్షేమం ప్రధాన ప్రమాణాలుగా ఉండాలని, ప్రతి అర్జీని నిబంధనల పరిధిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి విద్యార్థికి న్యాయం చేయాలని ఆదేశించారు.

అలాగే మారుమూల గ్రామాలు, దూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వచ్చే తల్లిదండ్రులు, సంరక్షకులు, బంధువులతో అధికారులు, సిబ్బంది అత్యంత మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. వారికి స్పష్టమైన సమాచారం అందిస్తూ, అవసరమైన మార్గదర్శకత్వం ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులకు గురి చేయరాదని ఆదేశించారు.ఈ సందర్భంగా మంత్రి అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి దళిత, గిరిజన విద్యార్థుల విద్యా అభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ భారీ స్థాయిలో నిధులు కేటాయించి గురుకుల విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్న సమయంలో, క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం లేదా అలసత్వానికి ఎలాంటి అవకాశం ఉండకూడదని స్పష్టం చేశారు.

ప్రభుత్వ సంక్షేమ లక్ష్యాలను ప్రతి అధికారి తన బాధ్యతగా భావించి పనిచేయాలని, ప్రజల పట్ల సానుభూతితో వ్యవహరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం, ఆధునిక మౌలిక వసతులు, పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

ఆ లక్ష్యాల సాధనలో అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.గురుకులాల్లో ప్రవేశాల కోసం వచ్చిన తల్లిదండ్రులు తమ సమస్యలను స్వయంగా విని వెంటనే స్పందించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు మంత్రి చూపుతున్న చొరవను వారు అభినందించారు.చివరగా మంత్రి. అడ్లూరి మాట్లాడుతూ “పేద విద్యార్థి చదువు ఆగకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత. దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించేలా అవసరమైన ప్రతి సహాయాన్ని ప్రజా ప్రభుత్వం అందిస్తుంది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు కూడా అదే నిబద్ధతతో పనిచేయాలి” అని స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News