పాలమూరు–రంగారెడ్డికి త్వరలో శుభవార్త.. 90 టీఎంసీల నీటి అనుమతుల కోసం కసరత్తు: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 15: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే శుభవార్త వినిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రాజెక్టు కింద 90 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపి అవసరమైన అనుమతులు సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. డిండి ప్రాజెక్టుకు సంబంధించి 30 టీఎంసీల నీటి కేటాయింపుల అంశంపైనా సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర రాజా గిగా కారిడార్‌లో ఏర్పాటు చేసిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ (CQP) తయారీ యూనిట్‌ను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో సీఎం మాట్లాడారు. కృష్ణా పరివాహక ప్రాంతంలోని పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఆర్డీఎస్ ప్రాజెక్టులకు పూర్తి అనుమతులు సాధించి మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.

తాను పాలమూరు బిడ్డనని పేర్కొన్న సీఎం.. అత్యంత వెనుకబడిన జిల్లాను అభివృద్ధిలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. విద్య, నీటిపారుదల, పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలో ట్రిపుల్ ఐటీ, ఇంజినీరింగ్ కళాశాలలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

తెలంగాణ రైజింగ్–2047 విజన్‌కు అనుగుణంగా టూరిజం, ఎనర్జీ, మెడికల్, స్పోర్ట్స్ రంగాల్లో కొత్త విధానాలు తీసుకొచ్చామని సీఎం పేర్కొన్నారు. పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన స్థానిక రైతుల త్యాగాన్ని గుర్తుంచుకొని, ఆ ప్రాంత యువతకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అమర రాజా యాజమాన్యాన్ని కోరారు.

ఎల్‌నినో ప్రభావంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్న సీఎం.. కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈవీ రంగంలో బ్యాటరీల తయారీకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందని, అలాంటి సమయంలో 32 గిగావాట్ సామర్థ్యంతో యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని చెప్పారు. అమర రాజా సంస్థలో 700 మంది ఉద్యోగుల్లో 400 మంది మహిళలు ఉండటం అభినందనీయమని పేర్కొన్నారు.

చిత్తూరులో ప్రారంభమైన అమర రాజా సంస్థ నేడు ప్రపంచ స్థాయి కంపెనీగా ఎదిగి, మహబూబ్‌నగర్‌లో భారీ పెట్టుబడులతో పరిశ్రమను నెలకొల్పడం సంతోషకరమని సీఎం అన్నారు. చైనా, జపాన్, జర్మనీ వంటి దేశాలతో పోటీపడే స్థాయికి ఎదిగిన అమర రాజా సంస్థను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని హామీ ఇచ్చారు.

Spread the love

Related News

Latest News