ప్రతిపక్షం, జూన్ 13: రాజ్యసభ ఎన్నికల సందర్భంగా నామినేషన్ తిరస్కరణతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్‌కు తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యత్వం కల్పించే అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. పార్టీకి విధేయంగా పనిచేస్తున్న ఆమెకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణకు చెందిన రాజ్యసభ స్థానాల్లో సమీప భవిష్యత్తులో ఖాళీలు లేకపోవడంతో ప్రత్యేక వ్యూహంపై కాంగ్రెస్ నాయకత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు కొనసాగుతున్న నేపథ్యంలో వారిలో ఒకరితో రాజీనామా చేయించి ఆ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను పంపించే అవకాశాలపై చర్చ జరుగుతోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య ఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రాథమిక స్థాయిలో చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం కొనసాగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ తరఫున ప్రస్తుతం రాజ్యసభలో అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీ, రేణుకా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారాన్ని కాంగ్రెస్ నాయకత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్యగా అభివర్ణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు రాజకీయంగా తగిన గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదిలా ఉండగా, తెలంగాణ నుంచి మీనాక్షి నటరాజన్‌ను రాజ్యసభకు పంపే అంశం నిజంగా కార్యరూపం దాల్చుతుందా? లేక రాజకీయ ప్రచారంగానే మిగిలిపోతుందా? అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే నిర్ణయంపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.

















