[t4b-ticker]

వరంగల్ అభివృద్ధికి కేంద్రం దృష్టి.. గడ్కరీకి వినతిపత్రం అందజేసిన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ప్రతిపక్షం, జూలై 28: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న కీలక రహదారి అభివృద్ధి పనులకు ఆమోదం తెలపాలని కోరుతూ వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని న్యూఢిల్లీలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రజల రాకపోకలకు అత్యంత కీలకమైన రహదారుల అభివృద్ధి, అసంపూర్తిగా ఉన్న సర్వీస్ రోడ్ల నిర్మాణం, సీఆర్‌ఐఎఫ్ నిధులతో చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని వారు కోరారు.

ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కరుణాపురం నుంచి పెద్దపెండ్యాల, నర్సింగరావుపల్లి, ఎలుకుర్తి, ధర్మసాగర్, దేవునూర్, సోమదేవరపల్లి, దామెర, ఎల్కతుర్తి మండల ప్రధాన కేంద్రాల వరకు ఉన్న రహదారిని విస్తరించి బలోపేతం చేయాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ రహదారి హైదరాబాద్ నుంచి కరీంనగర్, సిద్ధిపేట వైపు వెళ్లే వాహనాలకు వరంగల్ నగరంలోకి ప్రవేశించకుండా ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుందని, జాతీయ రహదారులు 163, 563లను అనుసంధానించే కీలక కారిడార్‌గా మారుతుందని వివరించారు. రైతులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు నిత్యం వినియోగిస్తున్న ఈ రహదారిని విస్తరించడం వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి ఊతమిస్తుందని తెలిపారు.

యాదాద్రి–వరంగల్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్–163) నాలుగు లైన్ల విస్తరణలో భాగంగా పలు గ్రామాల్లో నిర్మించిన సర్వీస్ రోడ్ల మధ్య మిగిలిపోయిన లింకులను కూడా వెంటనే పూర్తి చేయాలని ఎంపీ, ఎమ్మెల్యే కోరారు. నిడిగొండ, రఘునాథపల్లి, చాగల్, ఘన్‌పూర్ స్టేషన్, చిన్నపెండ్యాల, కరుణాపురం గ్రామాల పరిధిలో సర్వీస్ రోడ్లు ఉన్నప్పటికీ వాటి మధ్య అనుసంధానం లేకపోవడంతో స్థానిక ప్రజలు ప్రధాన జాతీయ రహదారిపైనే ప్రయాణించాల్సి వస్తోందని వివరించారు. దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ఇప్పటికే అవసరమైన భూమి సేకరణ పూర్తయిన నేపథ్యంలో మిగిలిన లింకుల నిర్మాణానికి వెంటనే ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

అదే విధంగా కేంద్ర రోడ్డు మరియు మౌలిక సదుపాయాల నిధి (సీఆర్‌ఐఎఫ్) 2025–26 కింద తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన అదనపు రహదారి అభివృద్ధి పనులకు కూడా ఆమోదం తెలపాలని కోరారు. నర్సంపేట–నందిగామ రహదారి విస్తరణతో పాటు భట్టుపల్లి–హంటర్ రోడ్ అభివృద్ధి పనులు పూర్తయితే గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం అందడంతో పాటు వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి దోహదపడతాయని వివరించారు.

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనలను అత్యవసరంగా పరిశీలించి త్వరితగతిన ఆమోదం తెలపాలని డాక్టర్ కడియం కావ్య, కడియం శ్రీహరి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఈ వినతులపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి, సంబంధిత ప్రతిపాదనలను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. వరంగల్ ప్రాంత రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది కీలక ముందడుగుగా మారుతుందని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News