ప్రతిపక్షం, జూలై 28: బేబీ పౌడర్ వినియోగం వల్ల క్యాన్సర్ సోకిందంటూ దాఖలైన వేలాది వ్యాజ్యాల పరిష్కారానికి ప్రముఖ ఔషధ, వినియోగ వస్తువుల సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థపై నమోదైన సుమారు 76 వేల కేసులను సెటిల్ చేసేందుకు 5.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.52 వేల కోట్లు) చెల్లించేందుకు అంగీకరించినట్లు కోర్టుకు తెలిపింది.
కోర్టు పత్రాల ప్రకారం, ఈ పరిహారంలో భాగంగా 2027లో 3 బిలియన్ డాలర్లు, మిగిలిన మొత్తాన్ని 2028లో చెల్లించనున్నట్లు సంస్థ వెల్లడించింది. దీంతో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న న్యాయపోరాటాలకు ముగింపు పలికే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.
అయితే, తమ బేబీ పౌడర్ ఉత్పత్తుల వల్ల క్యాన్సర్ వస్తుందన్న ఆరోపణలను జాన్సన్ అండ్ జాన్సన్ మరోసారి ఖండించింది. వినియోగదారుల ఆరోగ్యానికి తమ ఉత్పత్తులు సురక్షితమేనని, శాస్త్రీయ ఆధారాలు కూడా అదే విషయాన్ని నిర్ధారిస్తున్నాయని సంస్థ స్పష్టం చేసింది. పరిహారం చెల్లించేందుకు అంగీకరించడం ఆరోపణలను అంగీకరించినట్లుగా భావించరాదని కూడా పేర్కొంది.
ఇదిలా ఉండగా, టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ వినియోగం వల్ల క్యాన్సర్ సోకిందని ఆరోపిస్తూ అమెరికాతో పాటు పలు దేశాల్లో వేలాది మంది బాధితులు కోర్టులను ఆశ్రయించారు. ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల భద్రత, ఉత్పత్తుల నాణ్యతపై మరోసారి చర్చకు దారితీసింది.

















