- ప్రజావాణిని పరిశీలించిన హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రతిపక్షం బ్యూరో, హైదారాబాద్ జూలై 28: ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని హైదరాబాద్ జిల్లా ఇంచార్జి, బీసీ సంక్షేమం మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.మంగళవారం ప్రజా భవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ప్రజావాణికి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి, సంబంధిత అధికారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ప్రధానంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, 2BHK గృహాలు, రెవెన్యూ, మున్సిపల్, సంక్షేమం తదితర వివిధ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించి, అర్హులైన ప్రతి దరఖాస్తుదారుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రవాసి ప్రజావాణి ద్వారా విదేశాల్లో ఉపాధి, ఉద్యోగాలు, ఇతర కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రజల వినతులను కూడా మంత్రి పరిశీలించి, సంబంధిత శాఖల సమన్వయంతో వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రజావాణిలో ప్రజల నుంచి ప్రతిరోజూ అందుతున్న వినతులు, వాటి పరిష్కార స్థితి, శాఖల వారీగా తీసుకుంటున్న చర్యలపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి వినతిని బాధ్యతాయుతంగా పరిశీలించి, నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్ అధికారి విద్యాసాగర్‌లతో మంత్రి మాట్లాడి ప్రజావాణి నిర్వహణ, సమస్యల పరిష్కార ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు.ప్రజల సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని, ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి వినతికి పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కారం అందేలా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

















