ప్రతిపక్షం, జూలై 28: ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను దుర్వినియోగం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో రూ.8,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించిన సీఎం, తమ ప్రభుత్వం విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఏడాది ఫీజుల చెల్లింపుల కోసం ముందుగానే బ్యాంకుల్లో నిధులు జమ చేసే విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు.
పరీక్షల నిర్వహణలో గతంలో తరచూ పేపర్ లీకులు జరిగేవని, తమ ప్రభుత్వం పరీక్షల వ్యవస్థను పూర్తిగా పటిష్ఠం చేసిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త యాంటీ పేపర్ లీక్ చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో మరింత కఠిన చర్యలు చేపట్టి పరీక్షల పారదర్శకతను మరింత బలోపేతం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

















