[t4b-ticker]

స్కూలు విద్యార్థులకు కొత్త యూనిఫామ్

ప్రతిపక్షం, జూలై 28: తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కొత్త యూనిఫాంలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులందరికీ ఒకే విధమైన ఆకర్షణీయమైన దుస్తులను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫాంలు పంపిణీ చేయనుంది.

కొత్త నమూనా ప్రకారం బాలురకు లేత నీలం రంగు చొక్కా, ముదురు నీలం రంగు ప్యాంటు అందించనున్నారు. బాలికలకు లేత నీలం రంగు టాప్‌తో పాటు ముదురు నీలం రంగు బాటమ్‌ను అందిస్తారు. గురుకుల పాఠశాలల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మెరూన్ చెక్స్ టాప్, మెరూన్ రంగు లోవర్‌ను ప్రభుత్వం నిర్ణయించింది.

ఇకపై ఆరో తరగతి నుంచే బాలురకు నిక్కర్ల స్థానంలో పూర్తి ప్యాంట్లు ఇవ్వనున్నారు. విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరికీ రెండు జతల యూనిఫాంలు అందించనున్నారు. ఇందులో తొలి జతను స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15న పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రెండో జతను అనంతరం అందజేయనుంది.

యూనిఫాంలతో పాటు విద్యార్థులకు బూట్లు, సాక్సులు, టై, బెల్ట్ వంటి అవసరమైన వస్తువులను కూడా ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా నాణ్యమైన సౌకర్యాలు కల్పించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

కొత్త యూనిఫాం విధానం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఏకరూపత పెరగడంతో పాటు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ మరింత పెరుగుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. విద్యా ప్రమాణాల మెరుగుదలతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Spread the love

Related News

Latest News