ప్రతిపక్షం, జూలై 28: అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, అంతరిక్ష సాంకేతికత, స్టార్టప్‌ల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ కె. చందన, సహ వ్యవస్థాపకుడు, సీఓఓ భరత్ డాకాతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత అంతరిక్ష రంగంలో స్కైరూట్ సాధించిన విజయాలను వారు ముఖ్యమంత్రికి వివరించారు.
స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన దేశంలోని తొలి ప్రైవేట్ ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం ‘విక్రమ్-1’ విజయవంతమైన ప్రయోగంతో భారత అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ప్రతినిధులు తెలిపారు. ఈ ఘనతతో అమెరికా, చైనా తర్వాత ప్రైవేట్ రంగం ద్వారా ఆర్బిటల్ ప్రయోగ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోని మూడో దేశంగా భారత్ నిలిచిందని వివరించారు.
సమావేశంలో తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్న ఏరోస్పేస్, అంతరిక్ష సాంకేతిక రంగాల అభివృద్ధి, అధునాతన తయారీ, పరిశోధన–అభివృద్ధి (ఆర్ అండ్ డీ), ఆవిష్కరణలు, అలాగే ప్రభుత్వం–ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమల మధ్య భాగస్వామ్య అవకాశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. రాష్ట్రాన్ని అంతరిక్ష, హైటెక్ తయారీ రంగాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన చర్యలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా స్కైరూట్ వ్యవస్థాపకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. వారి విజయం భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకొచ్చిందని ప్రశంసించారు. అత్యాధునిక సాంకేతికత ఆధారిత పరిశ్రమలు, వినూత్న స్టార్టప్‌ల స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పిస్తుందని, అవసరమైన అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రపంచ స్థాయి అంతరిక్ష, సాంకేతిక సంస్థలు తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకునేలా ప్రభుత్వం పరిశ్రమలకు అనుకూల విధానాలతో ముందుకు సాగుతోందని సీఎం పేర్కొన్నారు. పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను దేశంలో ప్రముఖ అంతరిక్ష సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించారు.



















