ప్రతిపక్షం, జూలై 28: కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంట్‌లో ఉత్తమ వక్తగా గుర్తింపు పొందిన స్వర్గీయ ఎస్. జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో జైపాల్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి దేశ రాజకీయాల్లో విశిష్ట ముద్ర వేసిన నాయకుడని ముఖ్యమంత్రి కొనియాడారు. కేంద్ర మంత్రిగా, పార్లమెంటేరియన్‌గా ఆయన అందించిన సేవలు దేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.
పార్టీ సిద్ధాంతాలకు అంకితభావంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి జీవితాంతం కృషి చేసిన నాయకుడిగా జైపాల్ రెడ్డి నిలిచారని సీఎం గుర్తుచేశారు. ఆయన చూపిన మార్గం నేటి రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
ఈ నివాళి కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని జైపాల్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు కట్టుబడి పనిచేస్తామని నేతలు తెలిపారు.

















