ప్రతిపక్షం, జూన్ 19: వానాకాలం సాగు కోసం రైతులకు పెట్టుబడి సాయంగా అందించే ‘రైతు భరోసా’ నిధులను ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించే రైతుల సమ్మేళనం వేదికగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన విధంగా తొలి విడతలో ఒక ఎకరం వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6,000 చొప్పున నేరుగా జమ చేయనున్నారు. అనంతరం రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు, ఆ తర్వాత ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు దశలవారీగా నిధులు అందజేయనున్నారు.
నిధుల లభ్యత, ఆర్థిక సర్దుబాట్లను బట్టి మిగతా రైతుల ఖాతాల్లో కూడా రైతు భరోసా సాయాన్ని జమ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు సాగు ఖర్చుల భారం తగ్గి, వానాకాలం వ్యవసాయ పనులకు ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

















