Trending Now

మేడారం జాతర మరో రికార్డు..

మేడారం నుంచి ప్రతిపక్షం ప్రత్యేకప్రతినిధి: ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం జాతర మరో రికార్డు స్వంతం చేసుకుంది. ఈనెల 21 నుంచి 24 వరకు దాదాపు కోటిన్నర మంది భక్తులు వన దేవతలను దర్శించుకున్నారు. రెండేళ్లకో మారు జరిగే మేడారం జాతరకు నెల రోజుల ముందు నుంచి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు కనీస సౌకర్యాలు కల్పించారు. అయితే గతంతో పోలిస్తే ఈ ఏడాది ప్రభుత్వం భక్తులకు చేసిన ఏర్పాట్ల వల్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే వివిఐపీల తాకిడితో సామాన్య భక్తులకు కొంత ఇబ్బంది కలిగింది.

జాతర విజయవంతం.. మంత్రి సీతక్క

మేడారం జాతర విజయవంతమైందని, జాతరకు వచ్చిన భక్తులకు గతంలోకన్న మెరుగైన వసతులు కల్పించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. జాతర విజయవంతానికి కృషి చేసిన ప్రజలు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. మేడారంలో సమ్మక్క – సారలమ్మలను 4 రోజుల్లో దాదాపు 1.50 కోట్ల మంది దర్శించుకున్నారని సీతక్క వెల్లడించారు. జాతరలో వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు ఇచ్చిందన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా తమ వంతు కృషి చేశామని పేర్కొన్నారు. 20 శాఖల అధికారులు జాతర పనుల్లో కష్టపడి పనిచేశారని సీతక్క తెలిపారు.

భారీగా భక్తుల మిస్సింగ్​..

జాతరలో 5092 మంది మిస్‌ అయ్యారని, వారిలో 5060 మందిని కనిపెట్టి కుటుంబీకులకు అప్పగించాన్నారు. మరో 32 మంది అధికారుల వద్ద జాగ్రత్తగా ఉన్నారు, వారిని కూడా కుటుంబీకులకు క్షేమంగా అప్పగిస్తామని సీతక్క తెలిపారు. మేడారంలో 10 రోజుల పాటు పారిశుద్ధ్య పనులు జరుగుతాయని, జాతర జరిగిన తీరుపై మరోసారి సమీక్షిస్తామన్నారు. ఏమైనా లోటుపాట్లు జరిగితే సమీక్షించి సరిదిద్దుకుంటామని వెల్లడించారు. వచ్చే మినీ జాతర, మహాజాతరకు మెరుగైన ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు.

మేడారంలో భక్తులకు ఎలాంటి కష్టం కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ స్పష్టం చేశారు. మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న సభాపతి, మొక్కులు సమర్పించుకున్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు హామీలను ముందుకు సాగనిచ్చేలా చూడాలని తల్లులను కోరుకున్నానని గడ్డం ప్రసాద్ తెలిపారు. తనకు 9 ఏళ్లుగా సంతానం కలగలేదని సమ్మక్కను మొక్కితే కూతురు పుట్టిందని సభాపతి వెల్లడించారు. ఇప్పుడు తన కూతురికి 22ఏళ్ల వయస్సుగా పేర్కొన్న శాసనసభాపతి, పుట్టినప్పటి నుంచి ప్రతిసారి జాతరకు వస్తున్నానని వివరించారు.

Spread the love