నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 24 : కడెం ప్రాజెక్టు గేట్ల మరమ్మత్తులు పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కడెం ప్రాజెక్టును ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనుల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలానికి మునుపే గేట్ల మరమ్మత్తులు పూర్తి చేయాలని ఆదేశించారు. గత వర్షాకాలంలో గేట్లు తెరుచుకోకపోవడం వల్ల చాలా ప్రమాదకర పరిస్థితితులు ఏర్పడ్డాయని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గేట్ల మరమ్మతులు పూర్తి చేయాలని తెలిపారు. ఇదే సమయంలో పనుల నిర్వహణపై ఇంజనీరింగ్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అనంతరం కడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం డీఆర్‌డీఏ వారి ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక బృందాల వారిచే సిద్ధం చేయబడుతున్న ఏకరూప దుస్తుల తయారీ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఏకరూప దుస్తులను సిద్ధం చేయాలని తెలిపారు. దుస్తుల తయారీని నాణ్యవంతంగా చేపట్టాలని ఆదేశించారు.
ఆ తర్వాత కడెం మండలంలోని లింగాపూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు, వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో రైతులు ధాన్యాన్ని త్వరగా అమ్మేలా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే దానికి సంబంధించిన ట్యాబ్ ఎంట్రీని కచ్చితంగా పూర్తి చేయాలని సూచించారు. ధాన్యం మిల్లులకు తరలించేందుకు వీలుగా సరిపడినన్ని లారీలు, కూలీలను అందుబాటులో ఉంచాలన్నారు. రైతులందరూ ధాన్యాన్ని ప్యాడీ క్లీనింగ్ యంత్రాల ద్వారా శుభ్రపరిచే విధంగా ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు మాత్రమే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. అకాల వర్షాలు కురుస్తున్నందున రైతుల ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు వీలుగా సరిపడినన్ని టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యపు సంచుల్లో కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అనంతరం కడెం మండలం సారంగాపూర్ ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులన్నీ అత్యంత పారదర్శకంగా చేపట్టాలని, నాణ్యమైన వస్తువులను మాత్రమే ఉపయోగించాలన్నారు. పనులు ప్రారంభించడానికి ముందు, పనులు పూర్తయిన తర్వాత ఫోటోలతో కూడిన వివరాలను అందజేయాలని సూచించారు. మరుగుదొడ్ల మరమ్మత్తులు, విద్యుత్, స్లాబ్, గ్రిల్స్ ఏర్పాటు, పెయింటింగ్స్, ఇతర పనులు పరిశీలించారు. జూన్ 5 వ తేదీ లోపు అన్ని పనుల్ని పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో నీటిపారుదల శాఖ ఈ ఈ విఠల్, డీఈఓ రవీందర్ రెడ్డి, డిఆర్డిఓ విజయలక్ష్మి, పంచాయతీరాజ్ ఈ ఈ శంకరయ్య, సివిల్ సప్లయిస్ డాఎం శ్రీకళ, రైతులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.