ప్రతిపక్షం, జూన్ 18: నీట్ పునఃపరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పరీక్ష రాసే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సులభంగా చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
జూన్ 21న నిర్వహించనున్న నీట్ పునఃపరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు హాజరుకానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ నివాస ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకునే వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని వెల్లడించారు.
ఉచిత ప్రయాణం కోసం విద్యార్థులు తమ నీట్ హాల్ టికెట్‌ను బస్సు సిబ్బందికి చూపించాలని సూచించారు. హాల్ టికెట్‌ను ప్రయాణ ధ్రువీకరణ పత్రంగా పరిగణించి ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా ప్రయాణానికి అనుమతించాలని ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వివరించారు.
పరీక్షల సందర్భంగా విద్యార్థులు రవాణా సమస్యలతో ఇబ్బందులు పడకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ మేరకు ఆర్టీసీ సంస్థకు ప్రత్యేక సూచనలు ఇచ్చినట్లు, హాల్ టికెట్ కలిగిన ప్రతి నీట్ అభ్యర్థికి ఉచిత ప్రయాణం కల్పించాలని ఆదేశించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. పరీక్ష రాసే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
















