ప్రతిపక్షం, నిర్మల్ ప్రతినిధి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే సంక్షేమ పథకాల నిధులు, కార్యక్రమాల ద్వారా నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ముధోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ పేర్కొన్నారు. భైంసా పట్టణంలో శుక్రవారం బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధి పనులను ఏ విధంగా ఎక్కడైనా అడ్డుకున్న ఆ పనులన్నీ చేసి చూపుడుతానని.. స్థానిక కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్నామని కాంగ్రెస్ నాయకులు విర్రవీగుతున్నారని ఎన్నిచేసినా అభివృద్ధిని అడ్డుకోలేరని స్పష్టంచేశారు. 100 రోజుల్లో 150 కోట్ల అభివృద్ధి పనులు తెచ్చిన ఘనత తనది అన్నారు. కేంద్రంలో అధికారంలో తామున్నామని మళ్లీ వచ్చేది తమదేనని, రాష్ట్రంలో పాలన సాగాలంటే కేంద్రంపై ఆధారపడాల్సిందేనన్నారు. ప్రజా ఆశీర్వాదంతో గెలిచానని, ప్రజల కోసమే పని చేస్తానని, అధికారం కోల్పోయిన వారు ఇస్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.