ఖానాపూర్‌లో అదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 29 : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో అదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ విస్తృత ప్రచారం చేపట్టారు. మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ తో కలిసి ఖానాపూర్ మండలంలోని బాదన్ కుర్తి, సుర్జాపూర్, మస్కాపూర్, గోసంపల్లే గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. గ్రామాలలోని వీధులలో తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ, ఆప్యాయంగా పలకరిస్తూ, కమలం పువ్వు గుర్తును చూపిస్తూ ఓటేయాలని కోరతు ప్రచారాన్ని కొనసాగించారు. బాదన్ కుర్తి గ్రామంలో ఆటోలో కూచుని ప్రయాణీకులతో ముచ్చటించారు.
సుర్జాపూర్ గ్రామాంలో మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ గారితో కలిసి ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్నచోటికి చేరుకుని, ఉపాధి హామీ కూలీలతో ముచ్చటిస్తూ.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ.. కమలం పువ్వు గుర్తుకు ఓటువేయాలని కోరారు. వికసిత్ భారత్ లక్ష్యంగా సుపరిపాలన అందజేస్తున్ననరేంద్ర మోదీ గారిని మరో సారి ప్రధాని చేయడమే లక్ష్యంగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పదేళ్ల ఇండియా కూటమి సుస్థిర పాలనను అన్ని వర్గాల వారు సమర్థిస్తున్నారని చెప్పారు. బీహార్ ఎస్, కాంగ్రెస్ లు కుమ్మక్కై ప్రజలను మోసగించడమే తమ పనిగా తీర్చలేని హామీలను మోయలేని భారాన్ని ప్రజలపై మోపుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా బాధ్యులు, మండల బాధ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.