హైదరాబాద్, ప్రతిపక్షం బ్యూరో: బీఆర్ఎస్ కాళ్ల బేరానికి వచ్చినా రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు ఉండబోదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. మంగళవారం భైంసాలో విజయ సంకల్ప సభలో మాట్లాడుతూ.. తలకిందులుగా తపస్సు చేసినా కేసీఆర్‌ను దగ్గరకు రానివ్వమన్నారు. “మజ్లిస్ పార్టీతో దోస్తానా చేసిన బీఆర్ఎస్‌కు బీజేపీ చాలా దూరంగా ఉంటుంది. ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి నక్కకు నాగ లోకానికి ఉన్న తేడా ఉంది. అయోధ్య రామ మందిర నిర్మాణ విషయంలో రాహుల్, సోనియా గాంధీలు హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. రాముడిని అవమానించే రీతిలో మాట్లాడి, ఆలయ నిర్మాణాన్ని హేళన చేశారు. ప్రస్తుతం ఓట్ల కోసం రామ నామ జపం చేస్తున్నారు. ఓబీసీ రిజర్వేషన్లను నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వ్యతిరేకించారు. ఎన్నికల్లో లబ్ధి కోసం రాహుల్ ప్రస్తుతం ఓబీసీ రిజర్వేషన్ల అంశం తెరపైకి తెస్తున్నారు” అని లక్ష్మణ్ అన్నారు.