Trending Now

ఎంఎస్పీ చట్టం హడావుడిగా చేసేది కాదు


– రైతులు ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలి
– కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ​ముండా


న్యూఢిల్లీ: ఎలాంటి సంప్రదింపులు జరపకుండా తొందరపడి ఎంఎస్పీ చట్టాన్ని తీసుకురాలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ​ముండా స్పష్టం చేశారు. నిరసన తెలుపుతున్న రైతు సంఘాలు ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. మంగళవారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి మాట్లాడారు.

‘‘ ఇప్పటికే రైతు సంఘాలతో మంత్రుల బృందం రెండు దఫాలుగా చర్చలు జరిపింది. ఇందులో మేము వారి అనేక డిమాండ్లను అంగీకరించాం. కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. పరిపాలనా స్థాయిలో చేయగలిగే అనేక డిమాండ్లను నెరవేర్చడానికి కేంద్రం అంగీకరించింది. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించే విషయంలో ఎలాంటి చట్టాన్ని తీసుకురావాలి.. తెచ్చే చట్టం వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏమిటి అనేది చూడాలి. ఒక సమగ్ర విధానం కోసం దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు సహా అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది”అని మంత్రి చెప్పారు. దేశంలోని రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్న మోదీ ప్రభుత్వం.. కొందరు రైతులు నిరసన చేస్తున్నారు కదా అని తొందరపడి ఎలాంటి ప్రకటన చేయబోదని తెలిపారు. ‘‘ప్రభుత్వం కొన్ని ప్రకటనలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఉన్నది కేవలం ప్రకటనలు చేయడానికి కాదు.. పనులు చేయడానికి. వ్యవసాయం రాష్ట్ర జాబితాలోనిది. ఇది రైతులందరికి సంబంధించిన అంశం. వారిని దృష్టిలో ఉంచుకొని ఒక ఉన్నత స్థాయి నిర్ణయం తీసుకునే ముందు నిర్మాణాత్మక, ఫలవంతమైన చర్చలు జరపడం అవసరం” అని కేంద్ర మంత్రి అర్జున్ ​ముండా పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం హడావుడిగా జాతీయ స్థాయిలో ఏదైనా చేస్తే.. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని ఇప్పుడు నిరసన తెలుపుతున్న రైతులతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం వ్యక్తం చేస్తాయని గుర్తు చేశారు. రైతుల మద్దతు ధర బలోపేతం కోసం కృషి చేస్తున్న సంజయ్​అగర్వాల్ నేతృత్వంలోని కమిటీలో భాగస్వామ్యం కావాలని, లేదంటే కొత్త కమిటీ ఏర్పాటు చేస్తామని రైతులను కోరినట్లు అర్జున్ ​ముండా తెలిపారు. స్పష్టమైన నిబంధనలతో సమగ్ర కాలపరిమితితో కూడిన చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ రైతు సంఘాలు అందుకు రెడీగా లేవని అన్నారు. “మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని వారికి చెప్పాం… మాట్లాడకూడదని, సమస్య సృష్టించడం ధ్యేయంగా ముందుకు వెళ్తే మేము ఏం చేయలేం. రాజకీయ ప్రయోజనాల కోసం ఆందోళనకర పరిస్థితిని సృష్టించి లబ్ధిపొందాలనుకునే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని నేను రైతులకు సలహా ఇస్తాను”అని వెల్లడించారు. రైతుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత 10 ఏండ్లలో వ్యవసాయ బడ్జెట్‌ను ఏటా రూ.27 వేల కోట్ల నుంచి రూ.1.24 లక్షల కోట్లకు పెంచిందని ముండా పేర్కొన్నారు.

Spread the love