ప్రతిపక్షం, జూన్ 08: హైదరాబాద్‌లో ప్రేమ పేరుతో యువతిని మోసగించి, ఆమె ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిలింనగర్ పోలీసుల సమాచారం ప్రకారం, రాము (40) అనే వ్యక్తి ఓ 32 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
ఈ క్రమంలో ఇద్దరూ ఏకాంతంగా గడిపిన సమయంలో యువతి ప్రైవేట్ ఫొటోలను అతడు తన మొబైల్‌లో చిత్రీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల యువతి పెళ్లి విషయాన్ని ప్రస్తావించగా, రాము అసలు ఉద్దేశం బయటపడినట్లు తెలుస్తోంది.
పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన అతడు, తన వద్ద ఉన్న ప్రైవేట్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తానంటూ బెదిరించాడు. వాటిని తొలగించాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యువతిని బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు చీటింగ్‌తో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళల వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తూ బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
















