2036 ఒలింపిక్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వాలి: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 10: 2036 ఒలింపిక్స్ క్రీడలకు భారత్ ఆతిథ్యం దక్కేలా ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో, ఆ క్రీడలకు తెలంగాణ వేదిక కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష వ్యక్తం చేశారు. గచ్చీబౌలి స్టేడియంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి గచ్చీబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన సీఎం, క్రీడా రంగంలో తెలంగాణ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

82 ఎకరాల్లో ప్రపంచ స్థాయి వసతులతో స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీని నిర్మించి 2028 డిసెంబరులో ప్రారంభిస్తామని చెప్పారు. క్రీడల్లో దేశం వెనుకబడటానికి స్పష్టమైన విధానం లేకపోవడమే కారణమని పేర్కొంటూ, తెలంగాణలో సమగ్ర క్రీడా విధానాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ యూనివర్సిటీ నిర్వహణలో ప్రభుత్వ జోక్యం ఉండదని, క్రీడా నిపుణులకు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తామని తెలిపారు.

హైదరాబాద్‌లో గతంలో ఆఫ్రో-ఏషియన్ గేమ్స్, ప్రపంచ మిలిటరీ గేమ్స్, కామన్‌వెల్త్ స్థాయి పోటీలు జరిగినప్పటికీ, అనంతరం క్రీడా మౌలిక సదుపాయాల వినియోగం తగ్గిందని పేర్కొన్న సీఎం, పాత స్టేడియాలన్నింటినీ పునరుద్ధరిస్తామని చెప్పారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు.

ఈ సందర్భంగా ప్యారా అథ్లెటిక్స్, షూటింగ్, బాక్సింగ్ తదితర విభాగాల్లో రాణించిన తెలంగాణకు చెందిన ఆరుగురు క్రీడాకారులకు మొత్తం రూ.7.15 కోట్ల నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. అలాగే 2026 ఖేలో ఇండియా యూత్ గేమ్స్, జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ మీట్‌తో పాటు హాకీ ఇండియా లీగ్, ప్రపంచ పికిల్‌బాల్ లీగ్, ఆర్చరీ ప్రీమియర్ లీగ్, టెన్నిస్ ప్రీమియర్ లీగ్ వంటి ప్రతిష్ఠాత్మక క్రీడా పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Spread the love

Related News

Latest News