ప్రతిపక్షం, జూన్ 23: తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు ప్రధాన అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.
ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర సహకారం, నిధుల సమీకరణ, అలాగే భారతీయ రైల్వే ఫైనాన్స్ సంస్థ నుంచి రుణాల మంజూరు అంశాలు సమావేశంలో ప్రాధాన్యంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మెట్రో విస్తరణ పనులను వేగవంతం చేయడంతో పాటు ఆర్థిక సహకారం అందించే అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతిపాదనలను కేంద్రానికి వివరించినట్లు సమాచారం.
ఈ భేటీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ రవాణా ప్రాజెక్టులపై కేంద్ర-రాష్ట్ర సమన్వయంతో ముందుకు వెళ్లే అంశాలపై చర్చలు సాగినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

















