ప్రతిపక్షం, జూన్ 20: ఆఫ్రికా దేశమైన కాంగో ప్రజలను ఎబోలా వైరస్ మరోసారి తీవ్రంగా కలవరపెడుతోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో వైరస్ వేగంగా వ్యాపిస్తుండగా, ఈశాన్య ప్రాంతంలోని బునియా నగర సమీపంలో ఉన్న కిగోంజే శరణార్థి శిబిరం పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
మే నెల ప్రారంభం నుంచి ఆ శిబిరంలోనే 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 933 ఎబోలా కేసులు నమోదుకాగా, 245 మంది మృతి చెందినట్లు కాంగో ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వైద్య బృందాలు, ఆరోగ్య సిబ్బంది అత్యవసర చర్యలు చేపడుతున్నారు.
సాధారణంగా కిగోంజే శరణార్థి శిబిరంలో నెలకు ఒకటి నుంచి మూడు మరణాలు మాత్రమే నమోదవుతుంటాయి. అయితే గత కొన్ని వారాల్లో మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరగడం ఆరోగ్య అధికారులను కలవరపెడుతోంది. శరణార్థి శిబిరాల్లో జనసాంద్రత అధికంగా ఉండటం, వైద్య సదుపాయాలు పరిమితంగా ఉండటం వల్ల వైరస్ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎబోలా ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, అనుమానిత కేసులను గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కాంగో ప్రభుత్వం సూచించింది. వైరస్ నియంత్రణ కోసం అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల సహకారంతో చర్యలు కొనసాగుతున్నాయి.

















