ప్రతిపక్షం, ఆగస్టు 11: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన సతీమణి గీతకు నాగార్జునసాగర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. సుమారు 34 ఏళ్ల క్రితం నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద అనుకోకుండా కలుసుకున్న ఈ ఇద్దరి పరిచయం అనంతరం ప్రేమగా మారి, చివరకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం కోసం సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు నాగార్జునసాగర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా 34 ఏళ్ల క్రితం తమ జీవితంలో చోటుచేసుకున్న పరిచయాన్ని వారు మరోసారి గుర్తుచేసుకున్నారు. అప్పట్లో దిగిన ఫొటోను పోలిన విధంగా ప్రస్తుతం కూడా అదే తరహాలో నిలబడి ఫొటో దిగడంతో నాటి మధుర జ్ఞాపకాలను మరోసారి నెమరువేసుకున్నారు.
నాగార్జునసాగర్ వేదికగా ప్రారంభమైన తమ పరిచయం ప్రేమగా మారి, పెళ్లితో జీవిత భాగస్వాములుగా మారిన ఈ జంట.. అదే ప్రాంతానికి మళ్లీ రావడంతో ఆనాటి జ్ఞాపకాలు సజీవమయ్యాయి. సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి అక్కడికి రావడం, ఆయన వెంట గీత ఉండటంతో ఈ పాత జ్ఞాపకానికి మరింత ప్రత్యేకత ఏర్పడింది.
34 ఏళ్ల క్రితం తీసిన ఫొటో, తాజాగా అదే తరహాలో దిగిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అప్పటి యువ జంటగా ఉన్న రేవంత్‌రెడ్డి–గీత.. ఇప్పుడు దంపతులుగా, సీఎం హోదాలో అదే ప్రదేశంలో నిలబడటం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఒకవైపు రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ నిర్వహించిన మహా వరుణయాగంలో సీఎం దంపతులు పాల్గొనగా.. మరోవైపు అదే పర్యటనలో తమ జీవితంలోని 34 ఏళ్ల నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం ప్రత్యేకంగా నిలిచింది.





























