[t4b-ticker]

ఎల్‌నినో ప్రభావం.. కూరగాయల సాగుకు 75% సబ్సిడీ విత్తనాలు: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 31, హైదరాబాద్: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలు, ముఖ్యంగా కూరగాయల సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన విత్తనాలను 75 శాతం సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

ఎల్‌నినో ప్రభావంపై రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి నేతృత్వంలోని నిపుణుల కమిటీ రూపొందించిన నివేదికను సీఎం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించే సెంట్రలైజ్డ్ కిచెన్ల పరిసరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించాలని సూచించారు.

రైతులు సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఇతర పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలని, వారు పండించిన ఉత్పత్తులను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసే విధానంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ ఎక్స్‌టెన్షన్ అధికారుల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు సాంకేతిక సూచనలు అందించాలని చెప్పారు.

నిపుణుల కమిటీ నివేదికలో పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, గ్రామాల వారీగా అత్యవసర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సూచించింది. అలాగే ప్రత్యామ్నాయ పంటల సాగుకు కొత్త రుణాలు మంజూరు చేయాలని సిఫార్సు చేసింది.

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగును పెంచి, రైతు బజార్లకు రవాణా సౌకర్యం కల్పించాలని, గ్రామీణ ప్రాంతాల్లో డెయిరీ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించాలని కమిటీ సూచించింది. అత్యవసర చర్యల అమలును పర్యవేక్షించేందుకు గ్రామస్థాయి బృందాలను ఏర్పాటు చేయాలని కూడా నివేదికలో పేర్కొంది.

Spread the love

Related News

Latest News