డిక్లరేషన్ హామీల అమలుకు కార్యాచరణ ప్రకటించాలి
బీఎల్‌ఎఫ్, బీఎల్‌పీ నాయకుడు కోటగిరి ఆంజనేయులు డిమాండ్
ప్రతిపక్షం ప్రతినిధి , సిద్ధిపేట అక్టోబరు 24: వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహించనున్న జనగణనలో బీసీ కులగణన కోసం ప్రత్యేక కాలమ్‌ను చేర్చాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్), బీఎల్‌పీ పార్టీల ఉమ్మడి మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు కోటగిరి ఆంజనేయులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రకటించిన బీసీ, ఎస్సీ–ఎస్టీ, రైతు డిక్లరేషన్ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు.
ఈ డిమాండ్ల సాధన కోసం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నవంబర్ 2 వరకు జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయ ఉద్యమకారులు, ప్రజాస్వామికవాదులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, రైతు, కార్మిక, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. శనివారం సిద్ధిపేటలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కోటగిరి ఆంజనేయులు, బీడీఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దబ్బేట ఆనంద్ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం సాధించాలంటే కులాలవారీగా జనాభా లెక్కలు సేకరించడంతో పాటు ప్రజల సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి స్థితిగతులపై సమగ్ర సమాచారం సేకరించాలని అన్నారు. ఈ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు.
బహుజన నాయకుడు సత్తయ్య మాట్లాడుతూ బీసీల జనాభాపై కచ్చితమైన గణాంకాలు ఉంటేనే విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాలు, బడ్జెట్ కేటాయింపుల్లో జనాభా దామాషా ప్రకారం న్యాయం జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బీసీల వాస్తవ జనాభా వివరాలు వెల్లడైనప్పుడే వారి అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు విధానాలు రూపొందించగలవని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సిద్దిపేట జిల్లా జేఏసీ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ జనగణనలో బీసీల కులాలవారీ జనాభా వివరాలు నమోదు చేసేందుకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని కోరారు. కులగణన ద్వారా వెలుగులోకి వచ్చే సామాజిక, ఆర్థిక అసమానతలను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన విధానాలు రూపొందించాలన్నారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన బీసీ, ఎస్సీ–ఎస్టీ, రైతు డిక్లరేషన్ హామీలను విస్మరించకుండా వాటి అమలుకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని సమావేశంలో పాల్గొన్న వక్తలు డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల సాధనకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలని కోరారు.ఈ సమావేశంలో మాస్ ప్రచార కార్యదర్శి బీసీ ప్రభు రాజ్ గంగపుత్ర, కొరివి కృష్ణస్వామి సేవాసమితి జిల్లా అధ్యక్షుడు కొత్తం శ్రావణ్‌కుమార్, నాయీ బ్రాహ్మణ సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు వేముల కుమార్, ఆర్‌ఎస్‌పీ పార్టీ జిల్లా నాయకుడు రవికుమార్, బీఎల్‌టీయూ ట్రేడ్ యూనియన్ చిన్నకోడూరు మండల ఇన్‌చార్జి దానబోయిన రాజు, దళిత బహుజన ఫ్రంట్ జిల్లా ఉపాధ్యక్షుడు పోతరాజు శంకర్, భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రతినిధి కొమ్మాట పుష్ప, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు నారోజు రత్నయ్య చారి తదితరులు పాల్గొన్నారు.






























