ప్రతిపక్షం, నవంబర్ 26: హైకోర్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్‌రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి రెండు వారాల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించి, న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఈ నిర్ణయం తీసుకుంది. జైలు శిక్షతో పాటు ఇద్దరికీ రూ.2 వేల జరిమానా కూడా విధించింది.
ఓ భూ వివాదానికి సంబంధించి పిటిషనర్‌కు రక్షణ కల్పించాలని గతంలో హైకోర్టు పోలీసు అధికారులను ఆదేశించింది. అయితే ఆ ఉత్తర్వులను అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు న్యాయస్థానం గుర్తించింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు ఇద్దరు అధికారులకు శిక్ష విధించింది.
అయితే ఈ ఉత్తర్వులపై అప్పీలు చేసుకునేందుకు అధికారులకు వారం రోజుల గడువు ఇచ్చింది. ఈ సమయంలోగా అప్పీలుకు వెళ్లి సంబంధిత ఉత్తర్వులు పొందాలని సూచించింది. అలా చేయని పక్షంలో వారం రోజుల్లోగా హైకోర్టు రిజిస్ట్రార్ ఎదుట లొంగిపోయి రెండు వారాల జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది.
అలాగే విధించిన రూ.2 వేల జరిమానాను చెల్లించకపోతే అదనంగా మరో వారం రోజుల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. పోలీసు అధికారులు న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యతను విస్మరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి.



























