కబర్దార్ పున్నా కైలాష్.. రాజగోపాల్ రెడ్డిపై అవాకులు పేలితే ఊరుకోం.

  • మునుగోడు కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ లో ఫైర్.
  • రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడమే రాజగోపాల్ రెడ్డి ఆశయం
  • సొంత డబ్బుతో చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించిన ఘనత రాజగోపాల్ రెడ్డిదే.
  • బీజేపీ వాళ్లకు పదవులిచ్చాడన్న ఆరోపణలు అబద్ధం – పనిచేసే వాళ్లకే పదవులు.
  • మునుగోడు అభివృద్ధికి నిధులు అడగడం పార్టీ వ్యతిరేక చర్యనా? – సీఎంకు నేతల ప్రశ్న

ప్రతి పక్షం మునుగోడు నవంబర్ 20 : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ చేసిన వ్యాఖ్యలను మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మునుగోడులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాయకులు ఒక్కొక్కరుగా కైలాష్ పై ఫైర్ అయ్యారు.

*రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు – బీమనపల్లి సైదులు.
మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీమనపల్లి సైదులు మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ని ప్రధానిగా చూడడమే మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆలోచన, ఆశయమని అన్నారు. అందులో భాగంగానే భువనగిరి లోక్ సభ స్థానం నుండి సొంత డబ్బులు ఖర్చు చేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించి పార్లమెంట్ కు పంపించారని గుర్తు చేశారు.రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి నీది కాదని కైలాష్ కు హెచ్చరించారు. బీజేపీ వాళ్లకు పదవులు ఇస్తున్నాడని ఆరోపణలు చేస్తున్నావ్… నేను బీజేపీకి వెళ్లలేదు అయినా నాకు రెండు సార్లు మండల పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారని తెలిపారు. చండూరు మండల పార్టీ అధ్యక్షుడిగా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తినే నియమించారని చెప్పారు. కబర్దార్ పున్నా కైలాష్, నిజాలు తెలుసుకోకుండా మరోసారి రాజగోపాల్ రెడ్డిపై అవాకులు చవాకులు పేలితే ఊరుకోమని హెచ్చరించారు.

*కోమటిరెడ్డి బ్రదర్స్ ను తిడితే నాయకుడివి అవుతావా? : బోయ దేవేందర్.
చౌటుప్పల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయ దేవేందర్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారుడిని అని ట్యాగ్ వేసుకుని తిరుగుతున్నావ్, కోమటిరెడ్డి బ్రదర్స్ ను తిడితే నాయకుడివి అవ్వాలని చూస్తున్నావా అని ప్రశ్నించారు. నిప్పులాంటి మనిషి, నికార్సైన నాయకుడు, ఎటువంటి అవినీతి మచ్చ లేని నాయకుడిని తిడితే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పారా నీకు అని నిలదీశారు.నేను బీజేపీకి వెళ్లలేదు అయినా మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను రెండవ సారి నియామకం అయ్యానని చెప్పారు. పున్నా నువ్వు పచ్చ కాంగ్రెస్ వెంట వెచ్చగా తిరుగుతున్నావ్, నల్గొండ టు హైదరాబాద్ పైరవీల కోసం తిరుగుతున్నావ్ అది అందరికీ తెలుసు అన్నారు. ఒక నాయకుడి మెప్పు కోసం ఎలా పడితే అలా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.10 ఏండ్లు టీఆర్ఎస్ పార్టీని ఎదిరించడంలో రాజగోపాల్ రెడ్డి ముందున్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావని అన్నారు. మీరందరూ కలిసి మునుగోడు ప్రాంతానికి అన్యాయం చేయాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. మునుగోడును అన్యాయం చేయాలని చూస్తే ప్రతి ఒక్కరు ఒక్కొక్క నిప్పు కణికలా మారి యుద్ధానికి సిద్ధమవుతారని హెచ్చరించారు.ముఖ్యమంత్రి కి విన్నవిస్తున్నాం.. అభివృద్ధికి నిధులు ఇవ్వమని అడగడం కూడా పార్టీ వ్యతిరేక చర్యేనా అని ప్రశ్నించారు. మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఎంపీని గెలిపించమని ఇంటికొచ్చి చెప్పి.. మంత్రి పదవి దేవుడెరుగు కనీసం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కూడా ఇవ్వక పోవడాన్ని ఏమనుకోవాలని నిలదీశారు.

*ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదువుతున్నావ్ : రాందాస్ శ్రీనివాస్.
మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ, బీజేపీ వాళ్లకు పదవులు ఇచ్చాడని పున్నా కైలాష్ అంటున్నాడని, చండూరు, చౌటుప్పల్, మునుగోడు మండల అధ్యక్షులు నాడు బీజేపీకి వెళ్లకపోయినా పనిచేసే వాళ్లకే పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతోటే వాళ్లకు మళ్ళీ పదవులు కట్టబెట్టాడని చెప్పారు. ఒక అంశం గురించి మాట్లాడేటప్పుడు నిజాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని, రాజగోపాల్ రెడ్డి ని బదనాం చేయడానికి ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదువుతున్నావని విమర్శించారు. ఒక బీసీ బిడ్డగా చెబుతున్నా, రాజగోపాల్ రెడ్డి గురించి అవాకులు పేలితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

*సొంత నిధులతో పాఠశాలల అభివృద్ధి : బుజ్జి.
మాజీ జడ్పీటీసీ నారాయణపూర్ బుజ్జి మాట్లాడుతూ, రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం నుండి నిధులు రాకున్నా తన సొంత నిధులతో చేతనైన కాడికి పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి కోసమే నిధులు ఇవ్వమని అడుగుతున్నారని, తన సొంతం కోసం కాదని గుర్తించాలని కోరారు.

*కోమటిరెడ్డి బ్రదర్స్ వల్లే కైలాష్ ఎదిగాడు : మిర్యాల వెంకన్న.
మునుగోడు మాజీ సర్పంచ్ మిర్యాల వెంకన్న మాట్లాడుతూ, పున్నా కైలాష్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా ఎదిగారో దానికి కారణం కోమటిరెడ్డి బ్రదర్స్ అని అన్నారు. నేను చేనేత బిడ్డగా చెబుతున్నాను, పున్నా కైలాష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. అనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొట్లాడి కొట్లాడి రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి కోసం పోరాడారని చెప్పారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి కొట్లాడుతున్నారని, అది నీ కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి పై ఎటువంటి కామెంట్లు పెట్టినా సహించమని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి మీరు కండ్లు తెరవండి, మునుగోడు వెనకబడి ఉందని, మా నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదు కాబట్టి మా ఎమ్మెల్యే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని అన్నారు. మా మునుగోడు అభివృద్ధికి నిధులు ఇవ్వకపోతే మేమే తిరగబడతామని హెచ్చరించారు.

*పార్టీ జెండాను పట్టి ఎమ్మెల్సీగా గెలిచారు : పూల వెంకటయ్య.
నాంపల్లి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య మాట్లాడుతూ, 2015లో టీఆర్ఎస్ గాలికి ఎదురొడి కాంగ్రెస్ ఎమ్మెల్సీగా గెలిచారని, పార్టీ కోసం ఎవరూ ముందుకు రాకపోతే పార్టీ జెండాను చేత పట్టి ఎమ్మెల్సీగా గెలిచారని గుర్తు చేశారు. మాట ఇచ్చి మోసం చేస్తే ప్రశ్నించొద్దా అని అడిగారు. మునుగోడు అభివృద్ధి చెందకుండా ఉండాలని చూస్తున్నావా పున్నా కైలాష్ అని ప్రశ్నించారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్, విద్యా వైద్యం, రోడ్డు అభివృద్ధి చెందాలని అహర్నిశలు కష్టపడుతున్నారని చెప్పారు. బిల్లులు రాకపోతే ఏం చేయాలి, కాంట్రాక్టర్లు పనులు వదిలిపెట్టి వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి అహర్నిశలు పనిచేస్తున్నారని, మా రాజగోపాల్ రెడ్డి వెంట మేమందరం కలిసి నడుస్తామని అన్నారు.

*స్క్రిప్ట్ చదువుతున్న సన్నాసి : పల్లె వెంకన్న గౌడ్.
చండూరు మండల పార్టీ మాజీ అధ్యక్షుడు పల్లె వెంకన్న గౌడ్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే ప్రధాన లక్ష్యంగా మా నాయకుడు రాజగోపాల్ రెడ్డి ముందుకెళ్తున్నారని అన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నాటి ఇంచార్జ్ సునీల్ కనుగోలు పార్టీలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఈ రోజు తెలంగాణలో రాజకీయ శక్తిగా ఎదుగుతున్న రాజగోపాల్ రెడ్డి ని పలుచన చేయడానికి జరుగుతున్న కుట్రలో భాగంగా స్క్రిప్ట్ రాసిస్తే చదువుతున్నావని విమర్శించారు.

*మునుగోడు ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి : వెన్నంనేని రవీందర్ రావు.
నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెన్నంనేని రవీందర్ రావు మాట్లాడుతూ, మునుగోడు ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు స్థాయిని మరిచి మాట్లాడుతున్నావని, ముఖ్యమంత్రి కోసమే మాట్లాడడానికి నిన్ను డీసీసీ అధ్యక్షుడిగా పెట్టారా, పార్టీని బలోపేతం చేయడానికి పెట్టారా అని ప్రశ్నించారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని కాపాడాడని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు.

Related News

Latest News