ప్రతిపక్షం, ఆగస్టు 22: తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యావేత్తల బృందంతో ఫలప్రదమైన సమావేశం నిర్వహించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం తెలంగాణలో విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, యువ పారిశ్రామికవేత్తలకు అవకాశాల కల్పనలో కేంబ్రిడ్జ్‌తో భాగస్వామ్యంపై విస్తృతంగా చర్చించింది.
సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు, ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వారు కేంబ్రిడ్జ్ ప్రతినిధులకు వివరించారు.
ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలు హైదరాబాద్‌లో తమ విద్యా కార్యక్రమాలను విస్తరించేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని తెలంగాణ ప్రతినిధి బృందం వివరించింది. రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి విద్య, పరిశోధన అవకాశాలు అందించడంతో పాటు నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కేంబ్రిడ్జ్ భాగస్వామి కావాలని ఆహ్వానించింది.
కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్లు జైదీప్ ప్రభు, వెంకట సిరీష్ గండికోట తెలంగాణలోని అవకాశాలపై సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యా కార్యక్రమాలు, సంయుక్త పరిశోధనలు, యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, ఇంక్యుబేషన్ కార్యక్రమాలు, స్టార్టప్‌ల అభివృద్ధి వంటి అంశాల్లో సహకారానికి ఉన్న అవకాశాలను చర్చించారు.
హైదరాబాద్‌లో సంయుక్త విద్యా కార్యక్రమాలను నిర్వహించడం, పరిశోధనా ప్రాజెక్టులను చేపట్టడం, యువ పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశం చేయడం, స్టార్టప్‌లకు అవసరమైన ఇంక్యుబేషన్ సదుపాయాలను అందించడం వంటి అంశాలపై ఇరు వర్గాలు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని నిర్ణయించాయి.
తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంలో భాగంగా హైదరాబాద్‌ను అంతర్జాతీయ విద్య, పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థలతో భాగస్వామ్యానికి ప్రయత్నాలు చేయడం ద్వారా రాష్ట్ర విద్యార్థులు, పరిశోధకులు, యువ పారిశ్రామికవేత్తలకు మరిన్ని అంతర్జాతీయ అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంతో జరిగిన తాజా చర్చలు తెలంగాణలో విద్యా, పరిశోధన రంగాల అభివృద్ధికి కొత్త మార్గాలను తెరవనున్నాయని రాష్ట్ర ప్రతినిధి బృందం పేర్కొంది. ప్రపంచస్థాయి సంస్థల భాగస్వామ్యంతో హైదరాబాద్‌ను భవిష్యత్ తరాలకు అంతర్జాతీయ విజ్ఞాన, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ రైజింగ్ కార్యక్రమం ముందుకు సాగుతోంది.































