ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ, జూలై 28: మాజీ కేంద్ర మంత్రి, అత్యుత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి దేశ రాజకీయాలకు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు అందించిన సేవలను మంత్రి స్మరించుకున్నారు.దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన జైపాల్ రెడ్డి ప్రజా సమస్యలపై అపారమైన అవగాహనతో లోక్‌సభ, రాజ్యసభల్లో పదునైన వాదనలతో దేశవ్యాప్తంగా గౌరవాన్ని సంపాదించుకున్న గొప్ప పార్లమెంటేరియన్ అని మంత్రి కొనియాడారు.
ఆయన మేధస్సు, వాక్చాతుర్యం, ప్రజాస్వామ్య విలువల పట్ల అచంచలమైన నిబద్ధత ఆయనను విశిష్ట నాయకుడిగా నిలబెట్టాయని పేర్కొన్నారు.15వ లోక్‌సభకు తాను కొత్తగా ఎన్నికై పార్లమెంట్‌లో అడుగుపెట్టిన సమయంలో జైపాల్ రెడ్డి చూపిన మార్గదర్శకత్వం, ఆయన ప్రసంగ శైలి, ప్రజా సమస్యలపై ఉన్న లోతైన అవగాహన తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని మంత్రి గుర్తుచేశారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే ప్రక్రియలోనూ జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను జాతీయ స్థాయిలో సమర్థవంతంగా వినిపిస్తూ రాష్ట్ర ఆవిర్భావానికి ఆయన విశేష కృషి చేశారని పేర్కొన్నారు.సుదీర్ఘ రాజకీయ జీవితంలో సిద్ధాంతాలు, నైతిక విలువలు, పారదర్శకత, మచ్చలేని ప్రజాసేవకు కట్టుబడి పనిచేసిన జైపాల్ రెడ్డి రాజకీయ ప్రస్థానం నేటి, రేపటి తరాల రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన ఆశయాలు, ఆదర్శాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని మంత్రి పేర్కొన్నారు.

















