సరస్వతి శిశు మందిర్ విద్యార్థికి తృతీయ బహుమతి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు విద్యార్థులతో జరిగిన విజ్ఞాన మేళా
పదిహేను ప్రయోగాల సంకలనంలో ప్రతిభ కనబర్చిన మోతుకు కార్తికేయ
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, అక్టోబరు 4: దక్షిణ మధ్య క్షేత్ర స్థాయి విజ్ఞాన మేళాలో సిద్ధిపేటకు చెందిన మోతుకు కార్తికేయ తృతీయ బహుమతి సాధించాడు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని విద్యార్థులకు ఈ నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నూతక్కిలోని విజ్ఞాన్ విహార్ ఉన్నత పాఠశాలలో దక్షిణ మధ్య క్షేత్ర స్థాయి విజ్ఞాన మేళా నిర్వహించారు. ఈ మేళా ఆదివారం ముగిసింది. సిద్ధిపేటలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో ఆరో తరగతి చదువుతున్న కార్తికేయ ఈ విజ్ఞాన మేళాలో పదిహేను ప్రయోగాల సంకలనం విభాగంలో తృతీయ బహుమతి అందుకున్నారు. కార్తికేయ పాఠశాల, జిల్లా, విభాగ్(ప్రాంతీయ), రాష్ట్ర స్థాయిల్లో వరుస విజయాలతో ఈ స్థాయికి చేరుకోవడం విశేషం. కార్తికేయ తొలుత సిద్దిపేటలో నిర్వహించిన పాఠశాల స్థాయి, జిల్లా స్థాయి, విభాగ్ స్థాయి విజ్ఞానమేళాల్లో ప్రథమ బహుమతి సాధించాడు. నిర్మల్ జిల్లా బాసర సమీపంలోని ముధోల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి విజ్ఞానమేళాలోనూ పాల్గొని ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నాడు. దీంతో దక్షిణ మధ్య క్షేత్ర స్థాయి విజ్ఞానమేళాకు అర్హత సాధించాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నూతక్కిలో ఉన్న విజ్ఞాన్ విహార్ ఉన్నత పాఠశాలలో దక్షిణ మధ్య క్షేత్ర స్థాయి విజ్ఞానమేళా నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ మేళాలో పాల్గొన్నారు. ఈ విజ్ఞానమేళాలో మూడు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. విజ్ఞాన ప్రదర్శనలు, ప్రశ్నావళి పోటీ, పదిహేను ప్రయోగాల సంకలనం విభాగాల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. పదిహేను ప్రయోగాల సంకలనం విభాగంలో కార్తికేయ పాల్గొన్నాడు. వివిధ ప్రయోగాలను శాస్త్రీయ పద్ధతిలో వివరించి తన ప్రతిభను చాటుకున్నాడు. అతని ప్రదర్శనను పరిశీలించిన న్యాయనిర్ణేతలు తృతీయ బహుమతికి ఎంపిక చేశారు. దక్షిణ మధ్య క్షేత్ర స్థాయి వరకు వెళ్లి సిద్దిపేట విద్యార్థి బహుమతి సాధించడం పట్ల శ్రీ సరస్వతీ శిశు మందిర్ ప్రధానాచార్యుడు మోతుకు నరేశ్ కుమార్, ఆచార్యుల బృందం హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం, సృజనాత్మకత, పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించేందుకు పాఠశాల నిరంతరం ప్రోత్సహిస్తోందని ప్రధానాచార్యుడు తెలిపారు. కార్తికేయ సాధించిన విజయం పాఠశాలకు, సిద్దిపేట విద్యా రంగానికి గర్వకారణమని పేర్కొన్నారు. కార్తికేయను పాఠశాల యాజమాన్యం, ఆచార్యులు, తల్లిదండ్రులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.





























