- రైతు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం
- కళ్లముందే ఎండుతున్న వరి పంట.. ఆరుగాలం శ్రమను కాపాడుకునేందుకు అన్నదాత తాపత్రయం
ప్రతిపక్షం, మానకొండూర్, అక్టోబర్ 31: నీటి కొరత ఓ రైతుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎంతో కష్టపడి సాగు చేసిన వరి పంట నీరు లేక ఎండిపోతుండటంతో కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామానికి చెందిన రైతు గడిపల్లి రవీందర్ పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పొలానికి అందిస్తూ ఎండిపోతున్న పంటకు జీవం పోసే ప్రయత్నం చేస్తున్నారు.సాగు ప్రారంభం నుంచి పంట చేతికొచ్చే వరకు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ ఆరుగాలం శ్రమించిన రైతుకు చివరి దశలో నీటి కొరత రూపంలో సమస్య ఎదురైంది. కళ్లముందే పంట ఎండిపోతుంటే తట్టుకోలేక, పెట్టిన పెట్టుబడి వృథా కాకూడదనే ఆశతో సొంత ఖర్చుతో ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పిస్తున్నారు. సాధారణంగా కాలువలు, బావులు, బోర్ల ద్వారా పంటకు నీరందించాల్సిన పరిస్థితిలో ట్యాంకర్లపై ఆధారపడాల్సి రావడం రైతు దుస్థితిని తెలియజేస్తోంది.పంటను కాపాడుకునేందుకు రైతు చేస్తున్న ఈ ప్రయత్నం చూపరులను కదిలిస్తోంది. అన్నదాతకు సాగు కష్టాలు కొత్త కాకపోయినా, పంటను బతికించుకోవడానికి ట్యాంకర్లతో నీటిని తెప్పించాల్సిన పరిస్థితి రావడం వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను మరోసారి గుర్తుచేస్తోంది.





























