ప్రతిపక్షం, జూలై 30: తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రహదారులు, వంతెనలు, లో-లెవల్ కాజ్వేలు, కల్వర్టుల పరిస్థితిపై రోడ్లు–భవనాల శాఖ (ఆర్అండ్బీ) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో ఉమ్మడి జిల్లాలు, ఆర్అండ్బీ డివిజన్ల వారీగా రోడ్లు, వంతెనలు, కాజ్వేలు, కల్వర్టుల పరిస్థితిని మంత్రి సమీక్షించారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని సూచించారు. కోతకు గురైన రహదారులు, నీట మునిగిన కాజ్వేలు, కల్వర్టుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.
వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రోడ్లు, వంతెనల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ, పోలీసు, విద్యుత్, సాగునీటి శాఖలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
ప్రతి రోజు ఫీల్డ్ రిపోర్టును సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించాలని, తాను స్వయంగా క్షేత్రస్థాయి ఇంజినీర్లతో మొబైల్ ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పరిస్థితిని సమీక్షిస్తానని మంత్రి తెలిపారు. ప్రధాన ఇంజినీర్ (ఈఎన్సీ) నుంచి అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) వరకు ప్రతి అధికారి పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజల భద్రతకే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

















