[t4b-ticker]

నేపాల్‌ ఇంటి తరహాలో నిర్మాణాలు చేపట్టాలి: కొండా సురేఖ

ప్రతిపక్షం, ఆగస్టు 30: గోదావరి పుష్కరాలను తెలంగాణ ప్రత్యేకత, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాలు అంటే తెలంగాణే గుర్తుకు వచ్చేంత గొప్పగా ఏర్పాట్లు ఉండాలని, పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు తెలంగాణ సంస్కృతి గొప్పతనం కనిపించేలా నిర్మాణాలు చేపట్టాలని ఆమె దిశానిర్దేశం చేశారు.

పుష్కరాల సందర్భంగా చేపట్టే నిర్మాణ పనుల్లో నాణ్యతతో పాటు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే సామర్థ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. ఇటీవల నేపాల్‌లో సంభవించిన భారీ వరదల్లో చుట్టుపక్కల ఉన్న అనేక నిర్మాణాలు వరద ఉధృతికి కొట్టుకుపోయినప్పటికీ, ఓ ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా నిలిచిందని ఆమె అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఆ ఇంటి నిర్మాణ విధానాన్ని పరిశీలించి, అవసరమైన అంశాలను పుష్కరాల నిర్మాణ పనుల్లో ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టేటప్పుడు భవిష్యత్తులో వరదలు, భారీ వర్షాలు వంటి ప్రకృతి విపత్తుల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. భక్తుల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్మాణాల రూపకల్పన, నాణ్యత, మన్నికపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు.

బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంట ఉన్న ప్రాంతాల్లో పుష్కరాల ఏర్పాట్లను సమగ్రంగా చేపట్టాలని, ఆలయాల అభివృద్ధి, భక్తులకు వసతి, తాగునీరు, పారిశుధ్యం, రవాణా తదితర సౌకర్యాలను మెరుగుపరచాలని సూచించారు. తెలంగాణలో నిర్వహించే గోదావరి పుష్కరాలు భక్తులకు చిరస్మరణీయంగా నిలిచేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కొండా సురేఖ పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News