ప్రతిపక్షం, ఆగస్టు 30: నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తీవ్రంగా స్పందించారు. తనకు వాంగ్‌చుక్ ఎవరో తెలియదంటూ ఆమిర్ ఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సోనమ్ వాంగ్‌చుక్.. ఆమిర్ ఖాన్ ఇంకా ‘గజినీ’ పాత్ర నుంచి బయటకు రాలేదేమోనని సెటైర్ వేశారు. “మేము గతంలో కలిశాం. చాలా సేపు మాట్లాడుకున్నాం. బహుశా ఆయనకు స్వల్పకాలిక జ్ఞాపకశక్తి లోపం వచ్చి ఉండొచ్చు” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
‘త్రీ ఇడియట్స్’ చిత్రానికి తన కథ ఆధారం కాదని, ఆ సినిమా రూపొందించిన సమయంలో తనెవరో కూడా ఆమిర్ ఖాన్‌కు తెలియదని ఇటీవల నటుడు ఆమిర్ ఖాన్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే సోనమ్ వాంగ్‌చుక్ స్పందిస్తూ గతంలో తమ మధ్య జరిగిన పరిచయాన్ని గుర్తుచేశారు.
తనతో గతంలో ఆమిర్ ఖాన్ సుదీర్ఘంగా మాట్లాడారని చెప్పిన వాంగ్‌చుక్.. ఇప్పుడు తన గురించి తెలియదని చెప్పడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమిర్ ఖాన్, సోనమ్ వాంగ్‌చుక్‌ల మధ్య ‘త్రీ ఇడియట్స్’ సినిమా నేపథ్యంలో మరోసారి చర్చ మొదలైంది.





























