రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ బుధవారం రాత్రి క్షేత్రస్థాయి పరిశీలన

ప్రమాదకర బ్లాక్ స్పాట్ల గుర్తింపు.. నివారణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం

ప్రజల ప్రాణ రక్షణకు ప్రాధాన్యతనిస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలి – జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్

ప్రతిపక్షం ప్రతినిధి, కుమురం భీమ్ ఆసిఫాబాద్ నవంబర్26: ఆసిఫాబాద్ జిల్లా రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణ రక్షణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ బుధవారం రాత్రి కాగజ్‌నగర్ పట్టణం, కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరియు ఆసిఫాబాద్ హెల్మెట్ చౌరస్తా ప్రమాదకర బ్లాక్ స్పాట్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కాగజ్‌నగర్ పట్టణంలోని ఈఎస్ఐ టర్నింగ్, బట్టుపల్లి చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా, రాజీవ్ నగర్ బోర్డు, కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్ ,ఆసిఫాబాద్ హెల్మెట్ చౌరస్తా తదితర ప్రాంతాలను పరిశీలించి,ఆయా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలకు గల కారణాలు,ప్రమాదకర పరిస్థితులను సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే, ప్రమాదాలు జరగకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్ ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రమాదాలకు దారితీసే కారణాలను గుర్తించి సంబంధిత శాఖల సమన్వయంతో అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు.

వాహనదారులు అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని,ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరి ప్రాణం విలువైనదని,రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.

ప్రమాదాల నివారణే లక్ష్యం.. ప్రజల ప్రాణ రక్షణే పోలీసుల ప్రాధాన్యత!

ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్, ఆసిఫాబాద్ డి.ఎస్.పి అశోక్ కుమార్, సీఐ ప్రేమ్ కుమార్, సీఐ సంజయ్,సీఐ రవి,ఎస్ఐ వెంకటకృష్ణ, ఎస్ఐ సంధ్యారాణి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related News

Latest News