తెలంగాణలో తుఫాన్ ప్రభావం.. ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు!

ప్రతిపక్షం, నవంబర్ 02: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, జనగామ, సంగారెడ్డి, మెదక్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడి ‘మురాసు’ తుఫాన్‌గా మారడంతో తెలుగు రాష్ట్రాలపై దాని ప్రభావం కనిపిస్తోంది. ఈ తుఫాన్ దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉండటంతో తెలంగాణలోనూ వర్షాల తీవ్రత పెరగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రానున్న రోజుల్లో కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో చెరువులు, వాగులు, వంకల సమీపానికి వెళ్లవద్దని సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఆశ్రయం పొందకూడదని అధికారులు సూచిస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉన్నందున ప్రజలు ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను గమనించాలని సూచిస్తున్నారు.

Related News

Latest News